తెలంగాణ ప్రభుత్వం 2024లో తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్థ పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కుంటలు, భూములు, చెరువులను ఆక్రమించి చేసిన నిర్మాణాలతోపాటు.. మూసీ రివర్‌ను ఆక్రమించి కట్టిన భవనాలను కూడా కుప్పకూల్చిన సంగతి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అయితే.. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అదికారి రంగనాథ్ వ్యవహార శైలిపై హైకోర్టులో అనేక కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఆయనపై 63 కోర్టు ధిక్కరణ కేసులే ఉన్నాయని తాజాగా హైకోర్టు వెల్లడించింది. అంతేకాదు.. ఆయనను హైడ్రా కమిషనర్ పదవి నుంచి కూడా తప్పించాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి రంగనాథ్ కోర్టు తీర్పుపై స్పందించారు. తనకు న్యాయస్థానాలు, న్యాయ వ్యవస్థపట్ల గౌరవం ఉందని తెలిపారు. తానేమీ తప్పు చేయలేదన్న ఆయన.. కొందరు భూకబ్జాదారులే తనపై కక్షకట్టి.. కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. ఇవే ఇప్పుడు హైకోర్టులో ఉన్నాయని తెలిపారు. తనపై నమోదైన కేసులన్నీ.. `బడా బాబులు` పెట్టినవేనని ఆయన తెలిపారు. వారి కబ్జాల సామ్రాజ్యాలను తాను కూల్చి వేయడంతోనే తనపై కక్షకట్టి ఇలా చేస్తున్నారని తెలిపారు. తనకు గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఏ బాధ్యతలు అప్పగించినా.. పూర్తి నిబద్ధతతో పనిచేశానని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా శాంతా శ్రీరామ్ సంస్థపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ సందర్భంగా రంగనాథ్.. భూ కబ్జాదారుల చిట్టాను బయట పెట్టడం రాజకీయంగా పెను సంచలనంగా మారింది. ఆయన బయట పెట్టిన పేర్లలో కొందరికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌తో పాటు అధికార పార్టీ కాంగ్రెస్‌తోనూ సంబంధాలు ఉండడం గమనార్హం. వీరంతా ప్రభుత్వ భూములను కబ్జా చేయబోతే తాను అడ్డుకుని ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల మేరకు మేలు చేశానన్నారు. వారి భూ దాహానికి తాను అడ్డు పడబట్టే.. తనపై కోర్టుల్లో కేసులు వేశారని రంగనాథ్ ఆరోపించారు. ఈ వ్యవహారంతో ప్రభుత్వానికి మేలు జరిగిందన్నారు. అయితే.. హైకోర్టు ఆదేశాలపై మాత్రం రంగనాథ్ స్పందించలేదు.
ఇదీ చిట్టా..
+ శాంతా శ్రీరామ్ అనే స్థిరాస్తి సంస్థ నుంచి రూ.10 వేల కోట్ల విలువైన లోతుకుంట భూమిని కాపాడాం.
+ బతుకమ్మకుంట చెరువును మింగేయాలని చూసిన ఒకరిని అడ్డుకున్నాం.
+ లోతుకుంటలో వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలన్న ఒకరి ప్లాన్‌ను ధ్వంసం చేశాం.
+ సామాన్యుల స్థలాలు సొంతం చేసుకోవాలనుకున్న సంధ్యా శ్రీధర్‌రావు అనే వ్యక్తికి చెక్ పెట్టాం.
+ సింగరేణి కార్మికుల ప్లాట్లను కొట్టేయాలని భావించిన నల్ల మల్లారెడ్డిని అడ్డుకున్నాం.
+ ప్రభుత్వ భూములను ఆక్రమించిన ముఖీం అనే వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేశాం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
