ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ హరిత విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆగస్టు 1న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తు న్నారని.. ఆయన చేతుల మీదుగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నట్టు తాజాగా చంద్రబాబు ప్రకటించారు. చరిత్రలో నిలిచేలా ప్రారంభోత్సవం జరగాలన్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమని, కొత్త ఎయిర్ పోర్టు కొత్త అవకాశాలు తీసుకొస్తుందని చంద్రబాబు తెలిపారు.
“పోర్టులు, హైవేలు, పరిశ్రమలు, ఎయిర్పోర్టు, టూరిజం ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర ఇక అన్ స్టాపబుల్“ అని చంద్రబాబు వ్యాఖ్యా నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, కళలను చాటేలా అత్యంత కళాత్మకంగా సంబరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కొత్త ఎయిర్ పోర్టు ఆ ప్రాంత స్థితిగతులను మార్చేస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆగస్టు 1వ తేదీన ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ మేరకు ప్రధాని షెడ్యూల్ ఖరారు అయ్యిందని సీఎం చెప్పారు.
2014లో నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలైన భోగాపురం ఎయిర్ పోర్టు పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసి…రెండేళ్ల కాలంలో పూర్తి చేసిందని చంద్రబాబు చెప్పారు. సర్వాంగ సుందరంగా తయారైన భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని, ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా భోగాపురం ఎయిర్ పోర్టులో నిర్మాణ వివరాలు, వసతులు, సౌకర్యాలను అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఎయిర్ పోర్టు కార్యకలాపాలు ప్రారంభించడానికి అవసరమైన 8 కీలక అనుమతులు ఇప్పటికే పొందినట్లు తెలిపారు.
ఉత్తరాంధ్ర ఇక అన్ స్టాపబుల్
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…”ఉత్తరాంధ్ర అభివృద్దిలో భోగాపురం ఎయిర్ పోర్టు కీలకం కానుంది. సామాన్యుల జీవితాలను మార్చే విధంగా ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రలో కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. ఎకనమిక్ యాక్టివిటీ ఉరుకులు పెడుతుంది. రాకపోకలు మొదలయ్యాక ఆ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మారుతాయి. సామాన్యులు కూడా అనేక రకాలుగా లబ్ది పొందుతారు. విశాఖ ఎకనమిక్ రీజియన్‌లో ఈ ఎయిర్ పోర్టు కీలక పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్‌లో వచ్చిన శంషాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్‌పోర్టు ఆ ప్రాంతంలో ఎటువంటి మార్పులు తెచ్చిందో నేడు భోగాపురంతో ఆ ప్రాంతంలోనూ అటువంటి మార్పులే తెస్తుంది.“ అని అన్నారు.
సెలబ్రేట్ చేసుకోవాలి
“ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, కళలను చాటేలా అత్యంత కళాత్మకంగా ఎయిర్ పోర్టులో ప్రతి విభాగాన్ని తీర్చిదిద్దాలి. ప్రధాని చేతుల మీదు జరిగే ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోవాలి. గిరిజన సంస్కృతి, హస్తకళలు గుర్తు చేసేలా స్వాగత కార్యక్రమం ఉండాలి. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభాన్ని ఉత్తరాంధ్రలోని ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు సెలబ్రేట్ చేసుకోవాల్సిన శుభ సందర్భం. ప్రతి పౌరుడూ ఎయిర్ పోర్టును చూసి గర్వించే పరిస్థితి రావాలి. ఉత్తరాంధ్రలో దీన్ని పండుగలా చేసేలా ప్రజలను, విద్యార్థులను, యువతను భాగస్వాములను చేయాలి” అని సీఎ చంద్రబాబు ఆదేశించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates