ప్రస్తుతం రాజధాని అమరావతి ప్రాంతం అభివృద్ధిలో ముందుకు సాగాలన్నది ప్రపంచ స్థాయి నగరంగా మారాల న్నది సీఎం చంద్రబాబు ఆలోచన. వ్యూహం కూడా. అందుకే.. అనేక వ్యయ ప్రయాసలకు సిద్ధమై.. దీనిని తిరిగి పట్టాలెక్కించారు. అయితే.. ఇప్పుడు దీనికి గండి కొట్టడం ద్వారా తన పంతం నెగ్గించుకునేందుకు వైసీపీ అధినేత జగన్ ప్రయత్నం చేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. మావిగన్ ప్రకటన చేయడం ద్వారా ఒక కల్లోల పరిస్థితిని సృష్టించి రాజధానిని నిలుపుదల చేయాలన్నది ఆయన వ్యూహం.
ప్రధానంగా మూడు అంశాలపై ప్రభావం..
1) పెట్టుబడులు: అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పుడిప్పుడే పెద్ద ఎత్తున సంస్థలు ముందు కు వస్తున్నాయి. తద్వారా రాజధానిలో కార్యకలాపాలు పుంజుకునేందుకు ముహూర్తం కూడా రెడీ అవుతోంది. అయి తే.. ఇప్పుడు మావిగన్ ప్రకటన ద్వారా ఒక గందరగోళ పరిస్థితిని సృష్టించి.. తద్వారా వాటినినిలుపుదల చేయడం ద్వారా.. వచ్చే ఎన్నికల వరకు కూడా అమరావతిని పుంజుకోకుండా చేయాలన్నది జగన్ వ్యూహం.
2) నిర్మాణాల నిలుపుదల: మావిగన్ ప్రకటనతో ప్రస్తుతం జరుగుతున్న రియల్ ఎస్టేట్ నిర్మాణాలకు పెను విఘాతం ఏర్పడే అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. జగన్ మూడు రాజధానులు అని ప్రకటన చేసినప్పుడు.. తర్వాత మావిగన్ అన్నప్పుడుకూడా.. అనేక మంది వ్యాపారులు డోలాయమానంలో పడ్డారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సహా మంత్రి లోకేష్ వారిని ఒప్పించి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూల పరిస్థితిలపై నమ్మకం పెంచారు. ఇప్పుడు వాటిని సడలించే ప్రయత్నమే జగన్ చేస్తున్నారన్నవాదన వినిపిస్తోంది.
3) వ్యాపారాలకు దెబ్బ: అమరావతిలో ఇప్పుడు వ్యాపారాలు కూడా పుంజుకుంటున్నాయి. గతంలో ఇక్కడ వ్యాపారం చేసేందుకుముందుకు వచ్చి.. తర్వాత వెనుదిరిగిపోయిన.. పలు సంస్థలు తిరిగి వస్తున్నాయి. కానీ, ఇప్పుడు జగన్ చేసిన ప్రకటనతో మరోసారి ఆయా సంస్థలు ఇరకాటంలో పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వ్యాపార లావాదేవీలు దెబ్బతిని రాష్ట్రానికి వచ్చే ఆదాయంపైనా ప్రభావం పడనుందని అంటున్నారు.
చంద్రబాబుకు బిగ్ ఛాలెంజ్!
ఈ క్రమంలో చంద్రబాబు దీనిని భారీ సవాల్‌గా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. పెట్టుబడి దారుల్లో నమ్మకం మరింత పెంచడంతోపాటు.. ప్రజల్లోనూ అమరావతిపై విశ్వాసం సడలకుండా చూడాలి. మరీ ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లోనూ కూటమిని గెలిపించుకునే అవసరాన్ని.. ప్రాధాన్యాన్ని జగనే కల్పించిన విషయాన్ని ఆయన మరింత జాగ్రత్తగా గమనించి.. దానికి తగిన విధంగా అడుగులు వేయాలి. తద్వారా.. ఈ ఛాలెంజ్‌ను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
