నిర్మ‌ల‌మ్మ‌కు శాఖ మార్పు… ?

కేంద్ర మంత్రివ‌ర్గంలో ప్ర‌క్షాళ‌న ఖాయ‌మ‌నే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో కీల‌క‌మైన ఆర్థిక శాఖ వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దాదాపు 10 సంవ‌త్స‌రాలుగా ఈ శాఖ‌కు మంత్రిగా ఉన్న నిర్మ‌లా సీతారామ‌న్‌ను త‌ప్పించ‌డం ఖాయ‌మ‌ని ఢిల్లీ వ‌ర్గాలు స‌హా.. బీజేపీ పెద్ద‌లు కూడా చూచాయ‌గా చెబుతున్నారు. అంతేకాదు.. ఆమె స్థానంలో ఆర్ బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్‌కు ప‌గ్గాలు అప్ప‌గిస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న స‌మ‌యంలో శ‌క్తికాంత దాస్‌.. చేసిన ప్ర‌యత్నాలు ఫ‌లించాయి. ఇది ఇప్పుడు ఆయ‌న‌కు క‌లిసి వ‌స్తుంద‌ని అంటున్నారు.

మార్పు వెనుక‌..

గ‌త 10 సంవ‌త్స‌రాల‌కు పైగానే కేంద్ర ఆర్థిక మంత్రిగా అప‌ర చాణిక్యురాలిగా పేరొందిన నిర్మ‌లా సీతారామ‌న్‌ను మార్చ‌డానికి ప‌లు కార‌ణాలు ఉన్నాయ‌ని జాతీయ మీడియా పేర్కొంది. గ‌త రెండేళ్లుగా నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెర‌గ‌డంతోపాటు.. ఆర్థిక కార్య‌క‌లాపాల‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతున్న ద‌రిమిలా.. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ప‌లు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల వ్య‌వ‌హారం కూడా దీనికి లింకుగా ఉంద‌ని పేర్కొన్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌జ‌ల ఆగ్ర‌హాన్ని త‌గ్గించేందుకు.. దేశంలో ఆర్థిక స‌మ‌స్య‌లు త‌గ్గించి.. కార్య‌క‌లాపాలను గాడిలో పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని జాతీయ మీడియా పేర్కొంటోంది.

డాల‌ర్‌తో పోలిస్తే.. గ‌త రెండేళ్లుగా రూపాయి మార‌కం విలువ ప‌డిపోతోంది. అదేస‌మయంలో స్టాక్ మార్కెట్ల‌లో భారీ న‌ష్టాలు.. దేశీయంగా ఆర్థిక కార్య‌కలాపాలు మంద‌గించ‌డం.. మ‌రోవైపు పొంచి ఉన్న ద్ర‌వ్యోల్బ‌ణ ముప్పు వంటి వాటిని స‌మ‌ర్థ‌వంతంగా నిర్మ‌ల‌మ్మ ఎదుర్కొన‌లేక పోతున్నార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఆమెను త‌ప్పించ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. అయితే.. పూర్తిస్థాయిలో ఆమెను మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పించ‌కుండా.. శాఖ‌ను మాత్ర‌మే మార్పు చేసే అవ‌కాశం ఉంద‌ని పెద్ద ఎత్తున బీజేపీ నాయ‌కుల మ‌ధ్య కూడా చ‌ర్చ సాగుతోంది.

దాసే ఎందుకు?

ఇక‌, శ‌క్తికాంత దాస్ విష‌యానికి వ‌స్తే.. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌గా ఆయ‌న క‌రోనా వంటి కీల‌క స‌మ‌యంలోనూ ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అదుపు చేసే చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప్ర‌పంచ స్థాయిలో ఆర్థిక స్థితి మంద‌గ‌మ‌నంలో ఉన్న‌ప్పుడు కూడా భార‌త్ త‌న‌ను తాను నిల‌బెట్టుకు నేలా ఆయ‌న వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగారు. ఆర్థిక రిజ‌ర్వ్‌లు త‌గ్గిపోకుండా చూశారు. ఇవ‌న్నీ భ‌విష్య‌త్తులో దేశాన్ని మ‌రోసారి నిల‌బెట్టే అవ‌కాశం ఉంటుంద‌న్న చ‌ర్చ సాగుతోంది. కాగా.. ప్ర‌స్తుతం శ‌క్తికాంత‌దాస్ పార్ల‌మెంటుకు ఏ స‌భ నుంచి కూడా ప్రాతినిధ్యం వ‌హించ‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న‌ను మంత్రిగా తీసుకుని.. త‌ర్వాత రాజ్య‌స‌భ‌కు ప్ర‌మోట్ చేయించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.