2014 ఎన్నికల తర్వాత.. గత ఏడాది ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆ పార్టీలో బాగా హైలైట్ అయిన మహిళా నేతల్లో యామిని సాధినేని ఒకరు. పార్టీలో మహిళా నేతల వాయిస్ తగ్గిపోతున్న సమయంలో యామిని తెరపైకి వచ్చి బలంగా తన వాయిస్ వినిపించింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆమె చేసిన ‘మల్లెపూలు’ కామెంట్ అప్పట్లో సంచలనం రేపింది. ఈ కామెంట్ వల్ల ‘మల్లెపూల సాధిని’గా ఆమెకు గుర్తింపు రావడం గమనార్హం. ఐతే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయ్యాక చాలా మంది నేతల్లాగే యామిని కూడా పార్టీని వీడింది. ఆమె భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకుంది. కానీ తెలుగుదేశం పార్టీలో మాదిరి ఇక్కడ ఆమె పెద్దగా హైలైట్ అయింది లేదు. చాలా వరకు తెర వెనుకే ఉండిపోయింది.
ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి యామిని వార్తల్లోకి వచ్చింది. ఏపీలో హిందూ ఆలయాల్లో జరుగుతున్న అపచారాలు, విగ్రహాల ధ్వంసంపై ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఏకంగా కన్నీళ్లు పెట్టేసుకుంటూ హిందూ ధర్మం గురించి వాపోయారు. ‘‘మహా సంఘటనం జరగాలి రాష్ట్రంలో. దయచేసి పెద్దలెవరైనా సరే ఉంటే.. అందరూ కలసికట్టుగా రండి. మేమంతా వస్తాం. ఎవరికి వారు ఇళ్లలోంచి బయటికి వద్దాం. మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. ఇంతకంటే దారుణాలు చూసే ఓపిక, భరించే శక్తి లేదసలు నిజంగా చెప్పాలంటే.
ప్రతి గుండె గుండెలో కూడా హిందూ జ్యోతి అనేది ఒక అఖండ దీపమై ఈ ముష్కరులు ఎవరైనా సరే వారిని దహించేయాలి. ఎంత అవమాన పరుస్తున్నారు హిందువులను, దేవుళ్లను. అవమానం జరిగిన చోటే ఒక మహా సంకల్పానికి బీజం పడాలన్నది నా కోరిక’’ అంటూ ఏడుస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది యామిని. ఈ వీడియో పట్ల సోషల్ మీడియాలో చాలా వరకు నెగెటివ్ కామెంట్లే పడ్డాయి.