మేక‌పాటి ఫ్యామిలీలో ఆస్తుల ర‌చ్చ‌లో జగన్ పేరెందుకు?

నెల్లూరు జిల్లాకు చెందిన పొలిటిక‌ల్ ఫ్యామిలీ మేక‌పాటి కుటుంబంలో ఆస్తుల ర‌చ్చ రోడ్డుకెక్కింది. ఈ కుటుంబం నుంచి ప‌లువురు నాయ‌కులు రాజ‌కీయాల్లో ఉన్నారు. మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, ఆయ‌న సోద‌రులు.. మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, రాజ‌గోపాల్ రెడ్డిలతోపాటు.. మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి(రాజ‌మోహ‌న్‌రెడ్డి కుమారుడు) ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో ఉన్నారు. గ‌తంలో మంత్రిగా ప‌నిచేసిన మేక‌పాటి గౌతం రెడ్డి మృతిచెందిన విష‌యం తెలిసిందే. దాదాపు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఈ కుటుంబానికి నెల్లూరులో మంచి పేరుంది.

మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి నెల్లూరు ఎంపీగా ప‌లుమార్లు విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి కూడా ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌లుమార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హించారు. ప్ర‌స్తుతం రాజ‌గోపాల్‌రెడ్డి మాత్రం వైసీపీ త‌ర‌ఫున ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విక్ర‌మ్‌రెడ్డి ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు వీరి కుటుంబ ఆస్తుల‌పై వివాదాలు చెల‌రేగిన దాఖ‌లాలు లేవు. కానీ, తొలిసారి మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ.. కుటుంబ ఆస్తుల వివాదాల‌పై మాట్లాడారు.

త‌న‌కు రెండు పెళ్లిళ్లు జ‌రిగాయ‌ని.. ఈ నెపాన్నిచూపించి.. త‌న సోద‌రులు రాజ‌మోహ‌న్‌రెడ్డి, రాజ‌గోపాల్‌రెడ్డి ఆస్తుల‌ను పంచ‌డం లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి వ‌య‌సు 63 ఏళ్లు. అయితే.. ఆయ‌న ఆస్తుల వివాదంతో రోడ్డెక్క‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. త‌న సోద‌రుడు రాజ‌మోహ‌న్‌రెడ్డి త‌న‌కు ఆస్తులు పంచ‌డం లేద‌ని.. రూపాయి కూడా ఇవ్వ‌లేద‌ని అన్నారు. ఇప్పుడు తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాన‌ని.. ఈ విష‌యాన్ని ప‌దే ప‌దే చెప్పినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అన్నారు. మేక‌పాటి కుటుంబం స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని జ‌గ‌న్ చెప్పిన‌ట్టు ఆడుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

వైసీపీని వీడి.. టీడీపీలో చేరినందుకే.. త‌న‌కు ఆస్తులు పంచ‌కుండా జ‌గ‌న్ తెర‌చాటున అడ్డు ప‌డుతున్నార‌ని చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి దుయ్య‌బ‌ట్టారు. చెల్లికి, త‌ల్లికి కూడా ఆస్తులు పంచ‌ని వాడు.. వారిని ఇంటి నుంచి వెళ్ల‌గొట్టిన వాడు చెబితే.. రాజ‌మోహ‌న్‌రెడ్డి ఎలా వింటున్నార‌ని ప్ర‌శ్నించారు.

ఉమ్మ‌డి ఆస్తిలో త‌నకు రూపాయిపంచిన‌ట్టు చెప్పినా.. త‌ను ఏమీ అడ‌గ‌బోన‌న్నారు. దీనిపై బ‌హిరంగ చ‌ర్చ‌కు కూడా తాను సిద్ధ‌మేన‌ని అన్నారు. జ‌గ‌న్ కార‌ణంగానే వైసీపీ నాశ‌నం అయింద‌ని, ఇంకా అవుతుంద‌ని చెప్పారు. సుప‌రిపాల‌న అందిస్తున్న చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి మ‌ళ్లీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు.