ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భవానీ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరా జయం పాలైన మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తాజాగా భీషణ ప్రతిజ్ఞ చేశారు. తాను ఇప్పట్లో అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదని చెప్పారు. తనను, తన పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమంగా ఓడించిన కేంద్రంపైనే తన పోరాటం కొనసాగుతుందని ఆమె చెప్పారు. అయితే.. అసెంబ్లీలోకి మాత్రం తాను వెళ్లేది లేదన్నారు.
ఈ క్రమంలో ఆమె లోక్‌సభకు పోటీ చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఇప్పట్లో లోక్‌సభ ఎన్నికలు లేవు. అయినప్పటికీ.. కీలకమైన బహరాంపూర్ పార్లమెంటు స్థానం నుంచి ఆమె పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇక్కడ నుంచి ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యూసఫ్ పఠాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. ఆయనతో రాజీనామా చేయించి.. ఆమె రంగంలోకి దిగుతారని తెలుస్తోంది.
స్వాగతించిన పఠాన్..
మమతా బెనర్జీ తన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటే.. తాను సంతోషంగా రాజీనామాచేస్తానని పఠా న్ ప్రకటించారు. వాస్తవానికి పఠాన్.. ప్రముఖ క్రికెటర్. 2011లో ప్రపంచ కప్‌ను కొల్లగొట్టిన బృందంలోనూ ఈయన ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మమత ఆయనను పార్టీలోకి స్వాగతించి 2024 ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ స్థానం నుంచి తానే బరిలోకి దిగే ప్రయత్నంలో ఉన్నట్టు వార్తలు వస్తున్న దరిమి లా.. పఠాన్ కూడా స్వాగతించడం గమనార్హం.
గెలుస్తారా?
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం సీఎం సువేందు అధికారి చేతిలో పరాజయం పాలైన మమత.. పార్లమెంటు ఎన్నికల్లో విజయం దక్కించుకుంటారా? అనేది ప్రశ్న. బహరాంపూర్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ బలంగా ఉంది. గతంలో మాదిరిగా టీఎంసీ అభ్యర్థులు లేరు. అయితే.. ప్రస్తుత ఓటమి తర్వాత.. తనకు సానుభూతి పవనాలు వస్తున్నాయని మమత అంచనా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటుకు రెడీ అవుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates