లెక్క‌లు బాగున్నా… జ‌నాల‌కు ఎక్క‌లేదు జ‌గ‌న్!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తన సోషల్ మీడియా ఖాతాలో ప్ర‌భుత్వ ప‌నితీరు.. అప్పుల లెక్క‌లు.. ప‌థ‌కాల‌కు వెచ్చిస్తున్న సొమ్ములు.. ఇలా అనేక విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వ ప‌నితీరుపై ఇటీవ‌ల కంప్ట్రోల‌ర్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్‌(కాగ్‌) ఇచ్చిన నివేదికలోని అంశాల‌నుకూడా జ‌గ‌న్ ప్ర‌స్తావించారు. ప్ర‌భుత్వం చెబుతున్న దానికి క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న దానికీ సంబంధం లేద‌ని విమ‌ర్శించారు. అదేస‌మ‌యంలో సొమ్ములు ఏమ‌వుతున్నాయో కూడా తెలియ‌డం లేద‌న్నారు.

ఇలా.. జ‌గ‌న్ ప‌లు అంశాల‌పై వివ‌ర‌ణ‌తోపాటు.. విశ్లేష‌ణ కూడా చేశారు. అదేస‌మ‌యంలో త‌న పార్టీ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు ప్ర‌జ‌లు చేసిన మేళ్ల‌ను మ‌రోసారి వివ‌రించారు. త‌మ హ‌యాంలో రైతుల‌కు.. మ‌హిళ‌ల‌కు, బీసీ సామాజిక వ‌ర్గాల‌కు ఎలాంటి మేలు చేశామ‌న్న‌ది ఆయ‌న చెప్పుకొచ్చారు. అయితే.. ఇంత చేసినా.. ఎంత చెప్పినా.. జ‌గ‌న్ మాట పెద్ద‌గా జ‌నాలు ప‌ట్టించుకో క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఎక్స్‌లోను.. త‌ర్వాత సామాజిక మాధ్య‌మాల్లోనూ జ‌గ‌న్ చేసిన పోస్టుకు పెద్ద‌గా నెటిజ‌న్ల నుంచి ఎలాంటి కామెంట్లురాలేదు. పైగా లైకులు కూడా ప‌డ‌లేదు.

చూసిన వారు కూడా త‌క్కువ‌గానే ఉన్నారు. ఒక‌ప్పుడు జ‌గ‌న్ స్పందిస్తే.. వెంట‌నే నెటిజ‌న్లు ఏదో ఒక కామెంట్ చేసేవారు. కానీ, ఈ ద‌ఫా మాత్రం.. దానికి భిన్నంగా ఎవ‌రూ స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. జ‌గ‌న్ ఇమేజ్ అయినా త‌గ్గి ఉండాలి. లేదా.. ఆయ‌న విశ్వ‌స‌నీయ‌త పై అనుమానాలు అయినా వ‌చ్చి ఉండాల‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇక‌, ఆన్‌లైన్ మాధ్య‌మాల‌కు.. నాలుగు గోడ‌ల మ‌ధ్య‌కు మాత్ర‌మే జ‌గ‌న్ ప‌రిమితం కావ‌డంతో సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు కూడా ఆయ‌న వాయిస్ చేరువ కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా 1.20 నిమిషాల పాటు సుదీర్ఘంగా జ‌గ‌న్ చేసిన ప్ర‌సంగానికి పెద్ద‌గా స్పంద‌న అయితే.. క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.