కొర‌వ‌డిన రాజ్యాంగం: విజ‌య్ విష‌యంలో ఏం జ‌రుగుతోంది?

దేశంలో ప్ర‌జాస్వామ్యానికి, ముఖ్యంగా రాజ్యాంగానికి పెద్ద పీట వేస్తున్నామ‌ని ప‌దే ప‌దే చెబుతున్నా.. ఆ స్ఫూర్తి మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. తాజాగా జ‌రిగిన త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లలో చోటు చేసుకున్న హంగ్‌ వ్య‌వ‌హారంపై ఇంకా ర‌చ్చ కొన‌సాగుతూనే ఉంది. కానీ, వాస్త‌వానికి ఈ స‌మ‌యంలోనే గ‌వ‌ర్న‌ర్ త‌న విచ‌క్ష‌ణ‌తోపాటు రాజ్యాంగం ప్ర‌కారం న‌డుచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, ఆ దిశ‌గా ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

త‌మిళ‌నాడు అసెంబ్లీలో 234 సీట్లు ఉన్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో న‌టుడు విజ‌య్ పార్టీ త‌మిళ వెట్రి క‌ళ‌గం పార్టీ(టీవీకే) 108 స్థానాల్లో విజ‌యంద‌క్కించుకుని అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించింది. ఇక‌, నిన్న మొన్న‌టి వ‌ర‌కు అధికారంలో ఉన్న డీఎంకే 59 స్థానాల‌కు ప‌రిమితం కాగా, అన్నాడీఎంకే.. 47 స్థానాల‌తో స‌రిపుచ్చుకుంది, కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు ద‌క్కాయి. ఇత‌ర సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్ వంటివాటికి రెండేసి చొప్పున సీట్లు ల‌భించాయి.

ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌లు ముగిసి.. నాలుగు రోజులు అయినా.. అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన టీవీకే అధినేత విజ‌య్‌.. తాము ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ప‌దే ప‌దే చెబుతున్నా.. గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర విశ్వ‌నాథ్ అర్లేక‌ర్‌మాత్రం స‌సేమిరా అంటున్నారు. ఆయ‌న చెబుతున్న‌ది మెజారిటీ చూపించాల‌ని. కానీ, వాస్త‌వం ఏంటి? రాజ్యాంగం ఏం చెబుతోంది? అనే విష‌యాల‌ను గ‌మ‌నిస్తే.. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 154 ప్ర‌కారం.. గ‌వ‌ర్న‌ర్‌కు విచ‌క్ష‌ణ ఉంటుంది. పోనీ.. దీనిని కాద‌నుకున్నా.. ఆర్టిక‌ల్ 164 ప్ర‌కారం.. ఆయ‌న వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చు.

త‌ద్వారా.. అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించిన పార్టీని ముందు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలి. ఆ త‌ర్వాత‌.. నిబంధ‌న‌ల ప్ర‌కారం.. 14 రోజుల్లో మ‌ద్ద‌తు నిరూపించుకునేందుకు స‌మ‌యం ఇవ్వాలి. కానీ.. ఇప్పుడు త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ ఆ ప‌నిచేయ‌డం లేదు. కానీ.. గ‌తంలో ఇవి జ‌రిగాయా? లేదా? అంటే.. బీజేపీ విష‌యంలో రెండు రాష్ట్రాల్లో జ‌రిగాయి. గోవాలో కూడా గ‌తంలో ఇదే ప‌రిస్థితి ఏర్ప‌డినప్పుడు.. హ‌డావుడిగా ప్ర‌భుత్వ ఏర్పాటుకు గ‌వ‌ర్న‌ర్ పిలిచారు. అనంత‌రం..బ‌ల నిరూప‌ణ‌కు అవ‌కాశం ఇచ్చారు.

అంతేకాదు.. మ‌ధ్య భార‌త రాష్ట్ర‌మైన మ‌హారాష్ట్ర‌లో కూడా బీజేపీ అతి పెద్ద‌పార్టీగా అవ‌త‌రించినా.. బ‌లం స‌రిపోలేదు. దీంతో ముందుగా బ‌ల నిరూప‌ణ చేసుకోవాల‌ని అప్ప‌టి గ‌వ‌ర్న‌ర్ కోర‌క‌పోగా.. తెల్ల‌వారు జామున దొడ్డిదారిలో 3.59 గంట‌ల స‌మ‌యంలో ఫ‌డ‌ణ‌వీస్‌తో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేయించారు. అంటే.. త‌మ‌కు అనుకూలంగా ఉన్న ప‌రిస్థితిలో ఒక‌ర‌కంగా.. లేక పోతే.. మ‌రోర‌కంగా.. గ‌వ‌ర్న‌ర్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న‌ది సుస్ప‌ష్టం.

ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ క‌నుస‌న్న‌ల్లోనే గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ న‌డుస్తోంద‌న్న విమ‌ర్శ‌ల‌కు ఇవి ద‌న్నుగా మారుతున్నాయి. ఇప్పుడు త‌మిళ‌నాడులోనూ అదే జ‌రుగుతోంది త‌ప్ప‌.. రాజ్యాంగ స్ఫూర్తికి ఎక్క‌డా పిడికెడు ప్రాధాన్యం కూడా ద‌క్క‌డం లేదు. నిజానికి ప్ర‌త్య‌ర్థి ప‌క్షం స్టాలిన్ సైతం.. టీవీకే ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఓకే అన్న త‌ర్వాత‌..కూడా గ‌వ‌ర్న‌ర్‌భీష్మించారంటేనే తెర‌వెనుక ఏదో జ‌రుగుతోంద‌న్న సంకేతాలు వ‌స్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.