కరోనా కారణంగా యావత్ ప్రపంచంలో ఇప్పుడు ప్రత్యేక పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. లాక్ డౌన్ వేళలోనే పెళ్లి చేసుకుంటున్నారు కొందరు. ఇందుకు అధికారుల వద్ద పర్మిషన్ తీసుకుంటున్నారు. లాక్ డౌన్ నిబంధనల్ని పాటిస్తూ పెళ్లిళ్లు చేసుకున్న ఒక జంటకు అధికారులు ఊహించని షాకిచ్చారు.
కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుత్యూరులో ఒక జంటకు పెళ్లి జరిగింది. అధికారులు సూచించిన దానికి తగ్గట్లే అతి తక్కువమందితో వారి పెళ్లి కార్యక్రమం పూర్తి అయ్యింది. పెళ్లి చేసుకున్న అమ్మాయిని వెంటపెట్టుకొని తమ ఊరికి తీసుకెళ్లాడు పెళ్లికొడుకు. గ్రామానికి చేరుకున్న వారు ఫస్ట్ నైట్ కార్యక్రమానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
పెళ్లి చేసుకున్న జంట ఊరికి వచ్చి.. ఫస్ట్ నైట్ కోసం రెఢీ అవుతున్న వేళ.. అధికారులు ఎంట్రీ ఇచ్చి షాకిచ్చారు. కరోనా వేళ.. ముందస్తు జాగ్రత్తగా పెళ్లి కొడుకుతో సహా.. పెళ్లికి హాజరైన 26 మంది ముందు హోం క్వారంటైన్ లో ఉండాలని.. అప్పటివరకూ ఫస్ట్ నైట్ ను వాయిదా వేసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు.
అప్పటివరకూ కోటి ఆశలతో ఉన్న పెళ్లికొడుకు మీద బిందెలతో నీళ్లు పోసిన చందంగా పరిస్థితి మారింది. అప్పటివరకూ ఫస్ట్ నైట్ గురించి కలలు కన్న ఆ పెళ్లి కొడుకు బాధలు అన్నిఇన్ని కావట. నిజమే.. ఇలాంటి పరిస్థితి పగోడికి కూడా రాకూడదని పలువురు వ్యాఖ్యానించటం గమనార్హం.