కేరళంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుదీర్ఘ విరామం తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందా? అంటే.. ఔననే అంటు న్నాయి… ఎగ్జిట్ పోల్ సర్వేలు. 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో ఈ నెల 23న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఈ పోరును అధికార ఎల్‌డీఎఫ్(కమ్యూనిస్టుల కూటమి), యూడీఎఫ్(కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమి) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అదేసమయంలో బీజేపీ కూడా ఇక్కడ పాగా వేయాలని భావించినప్పటికీ.. అంతసీన్ లేదని ఆదిలోనే గ్రహించి.. ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. మొత్తంగా ఈ రాష్ట్రంలో ఎల్‌డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్ కూటముల మధ్యే ప్రధాన పోరు సాగింది.
విజయన్.. పరాజయన్!
సీఎం విజయన్ నేతృత్వంలోని అధికార కూటమి ఎల్ డీఎఫ్.. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేరళ అభివృద్ధి సహా అనేక అంశాలను ఈ కూటమి ప్రజల మధ్యకు తీసుకువెళ్లింది. కానీ.. ఈ ఎన్నికలను కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో మంత్రుల బృందం దాదాపు 10 రోజుల పాటు కేరళలోనే తిష్ఠ వేసి.. కాంగ్రెస్ పక్షాన ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఈ ప్రచార పరంపరలో కేరళ ముఖ్యమంత్రి విజయన్ – తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల తూటాలు.. లేఖల అస్త్రాలు కూడా కనిపించాయి.
తాజాగా ఈ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ సర్వే వెలువడింది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో అధికా రంలోకి వచ్చే పార్టీకి.. కనీసం 71 స్థానాల్లో కలిసి రావాలి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ మెజారిటీ మా ర్కును దాటి.. మరిన్ని సీట్లను కొల్లగొడుతుందని పలు సర్వేలు చాటి చెప్పాయి. అందరిదీ ఒకే మాట.. అన్నట్టుగా సర్వే సంస్థలన్నీ కూడా.. విజయన్ పరాజయాన్ని స్పష్టం చేశాయి. ఇదే నిజమైతే.. సుదీర్ఘ కాలం తర్వాత.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ కేరళంను దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఈ రాష్ట్రంలో బీజేపీ స్వల్పంగా పుంజుకునే అవకాశం కనిపించింది. వచ్చే నెల 4వ తేదీన ఈ రాష్ట్ర ఎన్నికల వాస్తవ ఫలితం వెలువడనుంది.
ఇవీ సర్వేల అంచనా!.
చాణక్య స్ట్రాటజీస్: యూడీఎఫ్(కాంగ్రెస్): 72-80, ఎల్‌డీఎఫ్(కమ్యూనిస్టులు): 58-64, బీజేపీ: 1-3
పీపుల్స్ పల్స్: యూడీఎఫ్(కాంగ్రెస్): 75-85, ఎల్‌డీఎఫ్(కమ్యూనిస్టులు): 55-65, బీజేపీ: 0-3
ఎస్ ఏఎస్ గ్రూప్: యూడీఎఫ్(కాంగ్రెస్): 76-81, ఎల్‌డీఎఫ్(కమ్యూనిస్టులు): 61-66, బీజేపీ: 3-4
యాక్సిస్ మై ఇండియా: యూడీఎఫ్(కాంగ్రెస్): 78-90, ఎల్‌డీఎఫ్(కమ్యూనిస్టులు): 49-62, బీజేపీ: 0-3
పోల్ ల్యాబ్: యూడీఎఫ్(కాంగ్రెస్): 90-92, ఎల్‌డీఎఫ్(కమ్యూనిస్టులు): 45-46, బీజేపీ: 0-2
Gulte Telugu Telugu Political and Movie News Updates