తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి ఉన్న ముప్పు వంటివి ప్రధానంగా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం, తద్వారా ఆర్టీసీ గ్యారేజీల ఉనికి ప్రమాదంలో పడటంపై కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకు గాబరా?
ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు గాబరా చెందడం ఈ రోజు సమస్య కాదు. 2022 నుంచే వారు ఆందోళన బాట పట్టారు. కేంద్రం ప్రతిపాదించిన ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు సంస్థలైన టాటా వంటివాటి ద్వారానే ఆపరేట్ చేయాలన్న నిబంధన.. కార్మికులకు శాపం కానుందన్నది వారి ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.
1) ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణ: కేంద్రం అందిస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ విధానం.. ప్రైవేటు సంస్థలకే ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ఆర్టీసీ గ్యారేజీలు, సాంకేతిక ఉద్యోగుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2) జీసీసీ (గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్) విధానం: ఎలక్ట్రిక్ బస్సులను జీసీసీ విధానంలో ప్రైవేటు సంస్థల నుంచి అద్దెకు తీసుకోవడాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ బస్సులను ఆర్టీసీ నేరుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ.. అంత సామర్థ్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అలాగని వదిలేయను కూడా లేదు. ముఖ్యంగా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం వంటి పర్యాటక ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడపాలన్నది వ్యూహం.
3) ఉద్యోగుల బదిలీలు: ఎలక్ట్రిక్ బస్సుల రాకతో హైదరాబాద్ డిపోల్లోనే దాదాపు 800 బస్సులు రానున్నాయి. దీంతో ఇక్కడ పనిచేసే పాత ఉద్యోగులను జిల్లాలకు బదిలీ చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇక, వరంగల్‌లో 300 , కరీంనగర్‌లో 250, ఖమ్మంలో 150 బస్సుల వరకు ఆర్డర్ ఇచ్చారు. ఈ బస్సులు వస్తే.. తమ ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని కార్మికులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం వద్ద సరైన సమాధానం లేకపోవడమే ఇప్పుడు సమ్మెకు దారితీసింది.
ఆర్టీసీ సమ్మె… అసలు కారణం ఇదేనా?
Gulte Telugu Telugu Political and Movie News Updates