తెలుగుదేశంపార్టీ నేతల ఆరోపణల ప్రకారం ఇళ్ళపట్టాల పంపిణీ అవినీతిలో 40 మంది ఎంఎల్ఏలున్నారట. ఇళ్ళపట్టాల కోసం సేకరించిన భూమిలో రూ. 6500 కోట్ల అవినీతి జరిగిందని కూడా టీడీపీ ఆరోపిస్తోంది. డిసెంబర్ 25వ తేదీన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల ఇళ్ళపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. సరిగ్గా ఒక్కరోజు ముందు ఇదే విషయంపై టీడీపీ ఆరోపణలతో విరుచుకుపడింది. తాము అధికారంలోకి వస్తే ఆ మొత్తాన్ని 40 మంది ఎంఎల్ఏల నుండి కక్కిస్తామని హెచ్చరించటం గమనార్హం.
పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం 40 నియోజకవర్గాల్లో సేకరిచించిన భూమి వర్షాలకు ముణిగిపోయిన భూములు, కొండ, కోనల్లో సేకరించిన భూములు, శ్మశనాల్లో ఉన్నవి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవంతా ఓ వంద ఫొటోలతో టీడీపీ పార్టీ ఆఫీసులో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. రూ. 10 లక్షలు విలువచేసే భూమిని కూడా ఎంఎల్ఏలు, నేతలు ప్రభుత్వంతో రు. 30 లక్షలకు కొనిపించినట్లు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మారెడ్డి పట్టాభితో పాటు మరికొందరు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.
భూముల ధరలు పెంచేసి కొనుగోలు చేయటంలో సుమారు రు. 6500 కోట్ల అవినీతి జరిగినట్లు వీళ్ళు ఆరోపించారు. ఈ అవినీతి గనుక జరగకపోతే కనీసం మరో 20 వేల ఎకరాలను కొనుగోలు చేసి పేదలకు పంపిణీ చేసే అవకాశం ఉండేదన్నారు. పై స్ధాయిలో ఓ విధమైన అవినీతి జరుగుతుంటే క్రిందస్ధాయిలో మరోరకమైన అవినీతి జరుగుతోందని మండిపడ్డారు టీడీపీ నేతలు. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ఇళ్ళపట్టాల కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాలు విసిరారు.
సరే ఇన్ని ఆరోపణలు చేసిన టీడీపీ నేతలెవరు కూడా 40 నియోజకవర్గాల పేర్లను బయటపెట్టలేదు. అలాగే కుంభకోణానికి పాల్పడిన ఎంఎల్ఏల పేర్లను కూడా చెప్పలేదు. పోనీ అవినీతిలో భాగస్తులైన నేతల పేర్లను కూడా బయటపెట్టలేదు. అంటే నియోజకవర్గాల పేర్లు చెప్పకుండా, ఎంఎల్ఏలు, నేతల పేర్లు చెప్పకుండానే అవినీతి జరిగిందని ఆరోపణలు చేసేశారు. నిజంగానే వాళ్ళ దగ్గర ఎంఎల్ఏల పేర్లుంటే ఎందకు బయటపెట్టలేదన్నది ప్రశ్న. ఇళ్ళ పట్టాల పంపిణిపై కోర్టు స్టే ఇస్తుందని ఆశించినట్లున్నారు. అది జరగకపోయేసరికి ఆరోపణలకు దిగినట్లే అనిపిస్తోంది.