భార్యకు భయపడి తండ్రిని వదిలేసిన మాజీ మంత్రి

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించి ఇప్పుడో అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆదివారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. హాట్ టాపిక్ గా మారాయి.

తల్లిదండ్రుల రక్షణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. భార్యకు భయపడి ఒక మాజీ మంత్రి తన తండ్రిని వదిలేశారని.. ఆ తండ్రి అనాథాశ్రమంలో ఉంచారని.. ఇటీవల ఆయన చనిపోయినట్లుగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టం ప్రకారం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లల వేతనాల నుంచి కొంత మొత్తానికి కోత విధించి.. ఆ డబ్బును నేరుగా తల్లిదండ్రులకే అందజేసే ఉద్దేశంతో కొత్త చట్టానికి అవసరమైన బిల్లును తీసుకొచ్చారు.

ఈ బిల్లు ప్రకారం తమ తల్లిదండ్రుల్ని సరిగా చూసుకోకుంటే.. వారి స్థూల జీతం నుంచి 15 శాతం లేదంటే రూ.10వేలు ఏది తక్కువైతే అది కట్ చేసి.. తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ చట్టం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాకుండా.. ప్రైవేటు రంగ ఉద్యోగులకు.. ఎమ్మెల్యేలు.. సర్పంచ్ లతో సహా పలువురు ప్రజాప్రతినిధులకు వర్తించేలా చట్టాన్నిచేయాలన్నది సీఎం రేవంత్ సంకల్పం.

సమాజంలో ఏ తల్లిదండ్రులు అనాథలుగా మిగిలిపోకూడదన్న సంకల్పంతోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లుగా సీఎం చెబుతున్నారు. ఈ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఈ బిల్లుపై సీఎం రేవంత్ మాట్లాడే క్రమంలో రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ విజయ్ పత్ సింఘానియా ఉదాహరణను ప్రస్తావించారు.

ఆస్తులన్నీ కొడుక్కి రాసిచ్చిన తర్వాత ఆయన ఎదుర్కొన్న ఇబ్బందుల్ని గుర్తు చేస్తూ.. తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసే వారికి ఈ కొత్త చట్టం ద్వారా బుద్ధి చెబుతామన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఒకరు తన భార్యకు భయపడి తన తండ్రిని పట్టించుకోలేదని.. సదరు మాజీ మంత్రి కింద నుంచి పైకి వచ్చిన నేతగా పేర్కొన్నారు. కష్టపడి ఎదిగిన నేతగా పేర్కొన్నారు.

ఇలా పలు వివరాలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్.. సదరు మాజీ మంత్రి పేరును మాత్రం ప్రస్తావించలేదు. దీంతో.. సీఎం వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎవరా మాజీ మంత్రి? అన్నదిప్పుడు ఫజిల్ గా మారింది. సీఎం చెప్పిన ఉదాహరణ ప్రకారం చూస్తే.. సదరు నేత కచ్ఛితంగా బీఆర్ఎస్ కు చెందిన నేతగా చెబుతున్నా.. పలు అంశాల్ని క్రాస్ చెక్ చేసి చూసినప్పుడు.. సోషల్ మీడియాలో నలుగుతున్న పేరుతో.. సదరు మాజీ మంత్రి పేరు సరిపోని పరిస్థితి.

ఇక్కడే.. మరో వాదన వినిపిస్తోంది. సదరు మాజీ మంత్రి పేరు ఈజీగా అర్థం కాకుండా ఉండేందుకు.. కొన్ని లేని అంశాల్ని కూడా ప్రస్తావించి ఉంటారని భావిస్తున్నారు. ఏమైనా.. సీఎం రేవంత్ నోటి నుంచి పాసింగ్ కామెంట్ రూపంలో వచ్చిన ఈ అంశంపై తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని చెప్పక తప్పదు.