లాక్‌డౌన్ ఎఫెక్ట్‌: జ‌గ‌న్‌కు ఇది అతి పెద్ద స‌వాలే…!

రాష్ట్రంలో జ‌గ‌న్ స‌ర్కారు ఏర్ప‌డి ఏడాది పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ వైసీపీ స‌ర్కారును టార్గెట్ చేసుకునేందుకు ఎంచుకుంటున్న రంగాల్లో ప్ర‌ధానంగా క‌నిపిస్తోంది విదేశీ పెట్టుబ‌డులు.

ఆది నుంచి టీడీపీ అధినేత చంద్ర‌బాబు చెబుతున్న‌ట్టుగా.. తాము అధికారంలో ఉన్న స‌మ‌యంలో రాష్ట్రానికి భారీ ఎత్తున విదేశీ పెట్టుబ‌డులు తెచ్చామ‌ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టామ‌ని, త‌ద్వారా రాష్ట్రంలో ఉపాధి పెరిగింద‌ని, ముఖ్యంగా విశాఖ‌ను ఐటీ జోన్ చేశామ‌ని ఫ‌లితంగా రాష్ట్ర ఖ్యాతి ప్ర‌పంచ స్థాయికి చేరింద‌ని త‌ర‌చుగా చంద్ర‌బాబు ఏవేదిక ఎక్కినా చెప్పే మాట‌. అదేస‌మ‌యంలో ఆయ‌న తాను అధికారంలో ఉన్న ప్ర‌తి ఏటా జ‌న‌వ‌రిలో విశాఖ‌లో పెట్టుబ‌డుల స‌ద‌స్సును ఘ‌నంగానిర్వ‌హించేవారు.

దీనికి ప్ర‌పంచ దేశాల నుంచి కూడా భారీ ఎత్తున పారిశ్రామిక వేత్త‌ల‌ను, ఐటీ నిపుణుల‌ను కూడా ఆహ్వానించి రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను వివ‌రించేవారు. స‌రే.. పెట్టుబ‌డులు వ‌చ్చాయా ? లేదా ? అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఒక ముఖ్యమంత్రిగా మాత్రం చంద్ర‌బాబు ఒక ప్ర‌య‌త్నం చేశార‌నేది వాస్త‌వం. ఈ స‌ద‌స్సుల‌కు భారీ ఎత్తున జాతీయ‌, అంత‌ర్జాతీయ మీడియాను కూడా ఆహ్వానించి క‌వ‌రేజ్ ఇచ్చేవారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు వ‌చ్చింది. స్థానికంగా రాష్ట్ర ప‌రిస్థితుల మేర‌కు ఆయ‌న మేనిఫెస్టోలోని అంశాల‌ను అమ‌లు చేయ‌డంలో స‌క్సెస్ అవుతున్నారు. కానీ, దూర‌దృష్టితో చూసుకున్న‌ప్పుడు విదేశీ పెట్టుబ‌డుల వ్య‌వ‌హారం మాత్రం ఆయ‌న మెడ‌కు చుట్టుకుంటోంద‌నే వాద‌న వినిపిస్తోంది.

ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా విద్యావంతుడు, ధార‌ళంగా ఇంగ్లీష్ మాట్లాడ‌గ‌లిగిన మేక‌పాటి గౌతంరెడ్డి ఉన్నారు. అయితే, ఆయ‌న కూడా విదేశీ పెట్టుబ‌డుల వ్య‌వ‌హారంపై పెద్ద‌గా దృష్టి పెట్టింది లేద‌నేది అంత‌ర్గ‌తంగా కూడా ప్ర‌భుత్వంలో చ‌ర్చ సాగుతోంది.

ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్త‌యింది. గ‌డిచిన రెండు మాసాలు క‌రోనా ఎఫెక్ట్‌తో కొట్టేసినా.. మిగిలిన 10 మాసాల ప‌రిస్థితి ఏంటి ? అప్ప‌ట్లో కూడా పీపీపీల స‌మీక్ష వంటి వాటిని త‌ల‌కెత్తుకోవ‌డం, టెండ‌ర్ల‌కు జ్యుడీషియ‌ల్ రివ్యూలు నిర్వ‌హించ‌డం వంటి కీల‌క ప‌రిణామ‌లు స‌హ‌జంగానే పెట్టుబ‌డుల్లో ఆందోళ‌న రేకెత్తించాయి. అయితే, విదేశీ పెట్టుబ‌డుల‌కు వీటి నుంచి మిన‌హాయింపు ఇస్తామ‌ని ప్ర‌క‌టించినా.. ఇప్పుడు క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచం మొత్తం లాక్‌డౌన్‌లో బందీ అయింది.

దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఆర్ధిక మంద‌గ‌మ‌నం కొన‌సాగుతోంది. ప‌లు దేశాల ప‌రిస్థితి అంత ఆశాజ‌న‌కంగా కూడాలేదు. ప్ర‌స్తుతానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల మేర‌కు రాబోయే రెండు సంవ‌త్స‌రాల వ‌ర‌కు కూడా ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ కోలుకునేలా క‌నిపించ‌డం లేద‌ని నిపుణులు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం విదేశీ పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ విష‌యంలో ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికిప్పుడు ఆయ‌న పెట్టుబ‌డి దారులకు వెసులుబాట్లు క‌ల్పించినా.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆర్ధిక ప‌రిస్థితి బాగోలేని కార‌ణంగా.. పెట్టుబ‌డులు వ‌చ్చేందుకు అవ‌కాశం త‌క్కువేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ నేప‌థ్యంలో విదేశీ పెట్టుబ‌డుల వ్య‌వ‌హారం, ఉపాధి క‌ల్ప‌న వంటివి జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి స‌వాళ్లు మార‌తాయ‌ని చెబుతున్నారు.