గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ప్రభావమేనా ఇది ?

మొన్నటి గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దారుణంగా దెబ్బతిన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ ఎన్నికల్లో జనాల ఓట్లకోసం ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులో 50 శాతం తగ్గింపు, ఉచిత మంచినీటి సరఫరా లాంటి అనేక హామీలనిచ్చారు మున్సిపల్ మంత్రి కేటీయార్. అప్పట్లో కేటీయార్ ఇచ్చిన హామీలన్నీ కేవలం మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసమే అని అందరికీ అర్ధమైపోయింది. ఇదే సమయంలో అనేక అంశాల కారణంగా జనాలు టీఆర్ఎస్ కు ఓట్లేయలేదు. దాంతో బంపర్ మెజారిటి ఖాయమని భావించిన పార్టీకి ఊహించని పరాభవం తప్పలేదు.

ఎన్నికల్లో ఓటమి ప్రభావమా అన్నట్లుగా తాజాగా ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో సతాయింపులు మొదలుపెట్టింది ప్రభుత్వం. 50 శాతం రిబేటు దేవుడెరుగు పాత ట్యాక్సులు అంటే అరియర్స్ కూడా చెల్లించాల్సిందేంటూ జనాలకు నోటీసులిచ్చి హడలుగొడుతోంది. జీహెచ్ఎంసి పరిధిలోని ప్రాపర్టీ ఓనర్లందరికి ఉన్నతాధికారులు వరుసబెట్టి నోటీసులిస్తున్నారు.

ఎన్నికలు ముగియగానే ప్రాపర్టీ ఓనర్లందరికీ జీహెచ్ఎంసీ కమీషనర్ పేరుమీద ట్యాక్సులో 50 శాతం తగ్గించినట్లు ఎస్ఎంఎస్ లు వచ్చాయి. దాంతో ఓనర్లందరు హ్యాపీగా ఫీలయ్యారు. అయితే ఆ హ్యాపీ ఫీలింగ్ ఎంతోకాలం నిలవలేదు. ఎందుకంటే వెంటనే ఓనర్లకు నోటీసులు అందటం మొదలైంది. 2015 గ్రేటర్ ఎన్నికల సమయంలో ప్రాపర్టీ ట్యాక్సును తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో మంచి మెజారిటి రావటంతో అప్పట్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.

ప్రభుత్వ హామీకి తగ్గట్లే ప్రాపర్టీ ట్యాక్సు సుమారు రూ. 750 నుండి రూ. 101కి తగ్గింది. అంటే రూ. 1200 లోపు ట్యాక్సు చెల్లిస్తున్న వారికి బాగా ప్రయోజనం అందింది. గడచిన ఐదేళ్ళుగా చాలామంది ఓనర్లు ఇదే పద్దతిలో ట్యాక్సులు కడుతున్నారు. మొన్ననే జరిగిన ఎన్నికల్లో కూడా ఇలాంటి హామీనే ఇవ్వటంతో కట్టే ట్యాక్సు ఇంకా తగ్గుతుందని అనుకున్నారు. అయితే అధికారపార్టీ ఓడిపోవటంతో దాని ప్రభావం రివర్సులో పడుతుందని ఓనర్లు ఊహించలేదు.

తాజా నోటీసుల ప్రకారం ప్రాపర్టీ ట్యాక్సు భారీగా పెరగబోతోందని సమాచారం. మొన్నటి ఎన్నికల్లో కేటీయార్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రాపర్టీ ట్యాక్సును 50 శాతం తగ్గిస్తే జీహెచ్ఎంసీ మీద రూ. 350 కోట్ల భారం పడుతుందని లెక్కలు కట్టారట. దాన్ని పూడ్చుకోవటానికి 2015లో తగ్గించిన ట్యక్సును 2018 నుండి కట్టించుకునేందుకు ప్రభుత్వం రెడీ అయిపోయింది. అంటే ఒకచేతితో ఇచ్చి మరో చేతిలో లాగేసుకోవటం అన్నమాట. పైగా గడచిన మూడేళ్ళ అరియర్స్ కూడా కట్టాల్సిందే అని జీహెచ్ఎంసి ఉన్నతాధికారులు స్పష్టం చేస్తుండటంతో ఓనర్లలో ఆందోళన పెరిగిపోతోంది. మరి ఓనర్ల గోడును ప్రభుత్వం పట్టించుకుంటుందో లేదో చూడాల్సిందే.