ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి పనిచేయడం తనకు కొత్తకాదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనకు అత్యంత మంచి పాత మిత్రుడు (గ్రేట్ ఓల్డ్ ఫ్రెండ్) అని తెలిపారు. అమరావతి పర్యటనకు వచ్చిన గేట్స్.. సోమవారం సాయంత్రం సచివాలయంలో మంత్రి వర్గ బృందంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. చంద్రబాబు పట్టుబట్టి ఉండకపోతే.. నాడు హైదరాబాదుకు మైక్రోసాఫ్ట్ వచ్చి ఉండేది కాదన్నారు.
ఇక, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా సీఎం చంద్రబాబు వేస్తున్న అడుగులు ఆదర్శంగా ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు గేట్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తుందని తెలిపారు. ఇప్పటికే అమలవుతున్న సంజీవని కార్యక్రమానికి తాము సహకరిస్తామన్నారు. ఇదే సమయంలో ఐటీ రంగంలో విప్లవం తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను కూడా తాము ప్రోత్సహిస్తామన్నారు. గేట్స్ ఫౌండేషన్ తరపున ఏ సహకారం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
స్వర్ణాంధ్ర సాకారానికి గేట్స్ 10 సూత్రాలు ఇవీ..
ఆరోగ్యం: సంజీవని వంటి కార్యక్రమానికి ప్రోత్సాహం.
విద్య: పాఠశాల విద్యకు నిధుల సహకారం.
ఐటీ: సాంకేతిక రంగంలో ఏపీ సర్కారుకు అన్ని విధాలా సహకారం.
డేటా: డేటా కేంద్రాల స్థాపన ద్వారా ప్రపంచ స్థాయి గుర్తింపు.
డిజిటల్ పాలన: వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా డిజిటల్ పాలనను మరింత పెంచడం.
డ్రోన్స్: డ్రోన్స్ ఉత్పత్తి, తయారీ రంగంలో సహకారం.
సాగు: సాగులో సాంకేతికతను మరింత విస్తరించేందుకు గేట్స్ ఫౌండేషన్ పెట్టుబడులు.
వాతావరణ మార్పులు: వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగును అభివృద్ధి చేయడం.
ప్రకృతి విపత్తులు: ప్రకృతి విపత్తులను గుర్తించే వ్యవస్థకు సహకారం.
టెక్నాలజీ: అధునాతన టెక్నాలజీలో గేట్స్ సహకారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates