డామిట్… కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా తయారైంది బీజేపీ పరిస్థితి. వివాదాస్పద ” ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్ ) ” చట్టాన్ని నిన్నటి వరకు కాంగ్రెస్, కమ్యూనిస్టు, కాక్రోచ్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాయి. సర్ పేరిట అధికార బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని, కోట్లాది మంది అర్హుల ఓట్లను తొలిగిస్తుందని ఆరోపిస్తూ ఆయా పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తుంటే బీజేపీ, దాని అనుబంధ సంఘాలు సర్ ను సమర్ధిస్తూ వచ్చాయి. చివరికిది బీజేపీ మెడకే చుట్టుకోవడం ఊహించని పరిణామంగా చెప్పొచ్చు. అదికూడా బీజేపీ అడ్డాగా చెప్పుకునే ఉత్తర ప్రదేశ్ నుంచే సర్ వ్యతిరేక గళం వినిపించడం గమనార్హం.
2025 అక్టోబర్ 27 నుండి 2026 ఏప్రిల్ 10 వరకు ఉత్తర ప్రదేశ్ లో సర్ ప్రక్రియను నిర్వహించారు. ఇందులో భాగంగా మరణించిన లేదా ఇతర కారణాల వల్ల 2.04 కోట్ల పేర్లను తొలగించి, 84 లక్షల కొత్త పేర్లను చేర్చినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దీనివల్ల రాష్ట్ర మొత్తం ఓటర్ల సంఖ్య 15.44 కోట్ల నుండి 13.39 కోట్లకు తగ్గింది. దీని గురించి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ చేసిన ఆరోపణలు కొత్త వివాదాన్ని సృష్టించాయి. ఈ ప్రక్రియలో సుమారు 1.27 కోట్ల మంది హిందూ ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుండి తొలగించబడ్డాయని యోగి ఆదిత్యనాథ్ ఆరోపించడం దేశంలో సంచలనం సృష్టిస్తుంది.
పంచాయతీ ఓటర్ల జాబితాలో ఉన్న 66 లక్షల మంది, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులైన 55 లక్షల మంది, 18 నుండి 19 ఏళ్ల మధ్య వయస్సు గల 4.5 లక్షల మంది యువ ఓటర్ల పేర్లు అసెంబ్లీ ఓటర్ల జాబితాలో లేవని సీఎం యోగి ఆదిత్యనాథ్ వివరించారు. అదే సమయంలో రాష్ట్రంలో ముస్లిం ఓటర్ల సంఖ్య 1.65 శాతం పెరిగిందని తెలిపారు. దీనిపై వివరణ కోరుతూ బీజేపీ తరపున ఎన్నికల సంఘానికి అధికారిక వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.
ఇప్పటివరకు సర్ పేరుతో దేశంలోని ముస్లిం, క్రిస్టియన్, దళితుల ఓట్లను మాత్రమే తొలిగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ మేరకు ముస్లిం, క్రిస్టియన్ సమాజాల్లో భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. బీజేపీ దాని అనుబంధ సంఘాలు కూడా రోహింగ్యాల ఓట్లు తొలిగిస్తుంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని ప్రచారం చేశారు.
తీరా చూస్తే హిందువుల ఓట్లు పెద్ద సంఖ్యలో తొలిగించినట్లు వార్తలు బయటపడుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ చెబుతుంది కేవలం ఉత్తరప్రదేశ్ లో తొలిగించిన ఓటర్ల సంఖ్య మాత్రమే. దేశం మొత్తం 13 కోట్ల ఓట్లు తొలిగించారు. మరో 7 కోట్ల వరకు తొలిగించే అవకాశం వుందని అనధికారిక సమాచారం. అంటే మొత్తం 20 కోట్ల ఓట్లు తొలిగిస్తే అందులో హిందువుల ఓట్లు ఎన్నుంటాయో లెక్క తేలాల్సి వుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates