సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే అంబటి ఇంటిపై గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త దాడి చేయించారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
ఆ క్రమంలోనే మాధవిపై వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత రోజా విమర్శలు గుప్పించారు. అయితే, ఆ నేపథ్యంలో రోజా తనను బాడీ షేమింగ్ చేశారని గళ్లా మాధవి ఆరోపిస్తున్నారు. అయితే, రోజాపై పోలీసులకు ఫిర్యాదు చేయబోనని ఆమె చెప్పారు.
వైసీపీ నేతలకు ఇలా బాడీ షేమింగ్ చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం కొత్త కాదని మాధవి అన్నారు. వాళ్లు బేసిగ్గా ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాలంటే వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తారని చెప్పారు. సబ్జెక్ట్ కు వారు పరిమితం కారని, అసలు విషయంపై ఏమీ మాట్లాడరని విమర్శించారు.
ప్రత్యర్థి పార్టీల నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే వైసీపీ నాయకుల లక్షణమని అన్నారు. అలా చేయడం వల్ల ఎదుటివారు సబ్జెక్ట్ గురించి సమాధానం చెప్పలేరని వారు భావిస్తుంటారని అన్నారు.
అప్పుడు తమ వాదన కరెక్ట్ అని ప్రజలు భావిస్తారన్నది వైసీపీ నేతల భావన అని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్…ఇలా అందరు నాయకులను రోజా ముందుగా బాడీ షేమింగ్ చేస్తారని అన్నారు. అదే మాదిరిగా తనపై కూడా రోజా బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారని, కానీ, ఆ వ్యాఖ్యలపై స్పందించి తన స్థాయిని తాను తగ్గించకోబోనని మాధవి చెప్పారు.
వాళ్లకు వచ్చిన పదజాలాన్ని, భాషను వాడతారని, అంతకుమించి వారికి ఏమీ తెలీదని, వారిని ఇప్పుడు సంస్కరించలేమని చురకలంటించారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కుల రాజకీయాలను తెరపైకి తెచ్చారని, లడ్డూ ఫ్లెక్సీలపై వివాదం రేపారని అన్నారు.
అయితే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి..ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తాము ముందుకు పోతున్నామని, ఇటువంటి వ్యాఖ్యలపై, వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత ఎజెండాలపై స్పందించి సమయం వృథా చేయబోమని మాధవి మరోసారి స్పష్టం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
