బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రెండేళ్లుగా కార్తీక దీపం సీరియల్ లెక్క ఆ కేసు విచారణ కొనసాగుతూనే ఉందని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు సెటైర్లు కూడా వేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసులో తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు రెడీ అయ్యారని తెలుస్తోంది.
మరి కాసేపట్లో ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాం హౌస్ కు సిట్ అధికారులు వెళ్లబోతున్నారని, అక్కడే ఆయనకు నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. అంతేకాదు, ఎర్రవల్లిలోని ఫాం హౌస్ లోనే కేసీఆర్ ను రేపు సిట్ అధికారులు
విచారణ చేయబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
వాస్తవానికి, హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్ ల తర్వాత కవితను సిట్ అధికారులు విచారణకు పిలుస్తారని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా కేసీఆర్ పేరు తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఓ వైపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates