ఆ 11 ఎమ్మెల్యేల‌ను ఏం చేస్తారు?

వైసీపీ ఎమ్మెల్యేల వ్య‌వ‌హారంపై మ‌రోసారి క‌థ మొద‌టికి వ‌చ్చింది. అసెంబ్లీకి హాజ‌రు కాకుండానే జీతాలు, భ‌త్యాలు తీసుకుంటున్నార‌న్న‌ది వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల‌పై ఉన్న ప్ర‌ధాన ఆరోప‌ణ‌. బ‌య‌ట నుంచి వ‌చ్చి.. రిజిస్ట‌ర్‌లో సంత‌కాలు చేసి వెళ్లిపోతున్నార‌ని.. స‌భా కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రుకావ‌డం లేద‌న్న‌ది వైసీపీ ఎమ్మెల్యేల‌పై గ‌తంలో స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు కూడా వ్యాఖ్యానించారు. ఒక్క జ‌గ‌న్ మిన‌హా అంద‌రూ వేత‌నాలు తీసుకుంటున్నార‌ని.. మ‌రికొంద‌రు ప్ర‌యాణ ఖ‌ర్చుల‌(టీఏ)ను కూడా తీసుకుంటున్నార‌ని తెలిపారు.

ఈ నేప‌థ్యంలో గ‌త 18 మాసాల్లో ప్ర‌జాధనం వృథాగా వైసీపీ ఎమ్మెల్యేల‌కు ఇవ్వాల్సి వ‌చ్చింద‌ని కూడా స్పీక‌ర్ స‌హా డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. వ‌చ్చే నెల నుంచి మ‌రోసారి స‌భ జ‌ర‌గ‌నుంది. ఈ ద‌ఫా బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. దీనికి సంబంధించిన క‌స‌ర‌త్తు కూడా త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపేందుకు ప‌త్రిక‌లను సిద్ధం చేస్తున్నారు. ఇదిలావుంటే.. వైసీపీ ఎమ్మెల్యేల‌పై ఏం చేయాల‌న్న విష‌యం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది.

స‌భ‌కు రాకుండా.. తాత్సారం చేస్తున్న‌వారిపై అన‌ర్హ‌త వేటు వేసే ప్రొవిజ‌న్స్ లేక‌పోవ‌డం.. ఇక్క‌డ డ్రాబ్యాక్‌గా మారింది. దీంతో వేచి చూస్తున్నారు. న్యాయ నిపుణుల‌ను కూడా సంప్ర‌దిస్తున్నారు. అయితే.. ప్రొవిజ‌న్‌ వ్య‌వ‌హార‌మే సమ‌స్య‌గా మారింది. దీంతో ఇప్పుడు జీతాలు, భ‌త్యాల‌ను క‌ట్ చేయాల‌న్న ఆలోచ‌న చేస్తున్నారు. ఇదేస‌మ‌యంలో వ‌రుస‌గా రెండు స‌భ‌ల‌కు రాని వారిపై వేటు వేస్తూ.. తీర్మానం చేయాల‌ని.. భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో తొలుత‌వారికి స్పీక‌ర్ నుంచి సంజాయిషీ నోటీసులు వెళ్తాయి. అనంత‌రం..వారు ఇచ్చే స‌మాధానం ఆధారంగా చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంది.

కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఏ స‌భ‌లోనూ స‌భ్యుల‌కు వేత‌నాలు నిలిపివేసిన ఘ‌ట‌న‌లు లేవు. ఇక‌, స‌భ‌కు రానివారిపైచ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లా కూడా లేదు. ఈ నేప‌థ్యంలోనే వేచి చూసే ధోర‌ణినే అవ‌లంభించాల‌ని భావిస్తున్నారు. మ‌రోవైపు అసెంబ్లీ ఎథిక్స్ క‌మిటీ.. వైసీపీ ఎమ్మెల్యేల వ్య‌వ‌హారంపై అధ్య‌య‌నం చేస్తోంది. స‌భ‌కు రాకుండా వేత‌నాలు తీసుకుంటున్న విష‌యాన్ని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లి.. చ‌ర్చ‌కు పెట్టాల‌న్న వ్యూహం ఉంది. అదేస‌మయంలో చ‌ర్య‌ల‌కు కూడా దిగాల‌ని ఎథిక్స్ క‌మిటీ భావిస్తోంది. ఏదేమైనా.. వారిని ఏం చేయాల‌న్న విష‌యంలో క‌థ మొద‌టికి వ‌చ్చిన‌ట్టు తెలిసింది.