గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధిస్తున్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతికి ఎదురుగాలి వీస్తోందా? ఆయనను వరుసగా గెలిపించినప్పటికీ.. స్థానిక సమస్యలను ఆయన పరిష్కరించలేపోతున్నారా? దీంతో ప్రజల్లో ఓవిధమైన అసంతృప్తి పెల్లుబుకు తోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. కోన రఘుపతి వారసత్వ రాజకీయాల నుంచి పాలిటి క్స్‌ను అందిపుచ్చుకున్నారు. వరుసగా విజయాలు సాధిస్తున్నారు. వివాద రహితుడు, నిదానస్తుడు, దూకుడు లేని వ్యక్తిత్వం ఉన్న నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.
ఇది కొన్నాళ్లు మంచి అనే అనిపించింది. ప్రత్యర్ధి పక్షం దూకుడుగా ఉన్నప్పుడు.. ప్రజలు సహజంగానే నినాదంగా ఉండే నాయకుల వైపు మొగ్గు చూపుతారు. అయితే.. ఈ ఫార్ములా ఎప్పుడూ వర్కవుట్ అవు తుందని చెప్పడానికి వీలు ఉండదు. అదే ఇప్పుడు కోన రఘుపతికి ఇబ్బందిగా మారింది. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉండడంతో.. నియోజకవర్గంలో పనులు చేయించుకోలేక పోయారు. దీంతో ప్రజలు కూడా అర్ధం చేసుకున్నారు. అయితే.. ఇప్పుడు వైసీపీనే అధికారంలో ఉండడంతో ఆయన పనులు చేయించుకునేందుకు.. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవకాశం ఉంది.
అయినప్పటికీ.. కోన పట్టించుకోవడం లేదని అంటున్నారు స్థానిక ప్రజలు. దీనికి ఎమ్మెల్యే వర్గం చేస్తున్న వాదన.. కోన ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు కనుక.. బయటకు రాలేక పోతున్నారని! కానీ, స్పీకర్‌గా ఉన్న సీతారాం బయటకు వస్తున్నారు. వ్యాఖ్యలు సైతం చేస్తున్నారు. కానీ.. కోన ఎందుకో మౌనం పాటిస్తున్నారు తప్ప.. పదవికీ బయటకు రాలేక పోవడానికి ఎక్కడా సంబంధం కనిపించడం లేదు.
దీంతో నియోజకవర్గంలో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. మరోవైపు.. పార్టీ నేతలకు కూడా ఆయన అందుబాటులో ఉండడం లేదు. అంటే..దీనిని బట్టి.. వైసీపీలో ఆయన మాట వినేవారు ఎవరూ లేరా? లేక .. నియోజకవర్గంలో చేయడానికి ఎలాంటి పనులు లేవా? అనే సందేహాలు వస్తున్నాయి. మొత్తానికి ఇది వ్యతిరేకతగా మారితే.. కోనకు ఇబ్బందే అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates