ప్రస్తుతం ఏపీలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా.. ‘రాయచోటి’ గురించే పెద్దె ఎత్తున చర్చ సాగుతోంది. దీనిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా తీసేయడం.. తర్వాత.. మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకోవడం.. సీఎం చంద్రబాబు.. ఆయనను ఓదార్చడం వంటి అంశాలు ప్రముఖంగా మీడియాలో వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏ ఇద్దరుకలిసినా.. అసలు రాయచోటిలో ఏం జరిగింది? అనే అంశంపైనే చర్చిస్తున్నారు. ఇప్పటి వరకు రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం.. అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా ఉంది. వైసీపీ హయాంలో 2022-23 మధ్య చేపట్టిన జిల్లాల విభజన సమయంలో దీనిని ఏర్పాటు చేశారు.
అయితే.. తాజాగా రాయచోటిని జిల్లా కేంద్రంగా తప్పించడంతోపాటు.. అన్నమయ్య జిల్లా నుంచి దీనిని తీసేసి… కొత్త గా ఏర్పాటు చేస్తున్న ‘మదనపల్లె’ జిల్లాలో రాయచోటి నియోజకవర్గాన్ని చేర్చారు. ఇదీ.. వివాదానికి దారి తీసింది. ఇప్పటి వరకు జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మదనపల్లెలో కలపడాన్ని స్థానికులు ఒప్పుకోవడం లేదు. కేవలం స్థానికులే కాదు.. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా అంగీకరించడం లేదు. అయినా.. కూడా పాలనా సౌలభ్యం కోసం.. రాయచోటిని మదనపల్లె జిల్లాలో కలపాల్సి వచ్చిందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు.
అప్పట్లోనూ వివాదమే!
వైసీపీ హయాంలో చిత్తూరు జిల్లాను మూడుగా విభజించి.. తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లాకు రాయచోటిని జిల్లా కేంద్రంగా నిర్ణయించారు. దీనికి అప్పటి ఎమ్మెల్యే, జగన్‌కు అత్యంత సన్నిహిత నేత, రాయచోటి నియోజకవర్గంలో బలమైన పునాదులు ఉన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి బలమైన ప్రయత్నం చేయడంతోనే రాయచోటి నియోజవర్గాన్ని అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా మార్చారు. అయితే.. అలా చేయొద్దని.. తమకు ‘రాజంపేట’ నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రంగా మార్చాలని వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున నెలల తరబడి వివాదం చేశారు. ధర్నాలు, నిరసనలు చేపట్టారు. కానీ, జగన్ తన వైఖరినే కొనసాగించారు. అప్పటి నుంచి రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంది.
మంత్రికి చిక్కులు వస్తాయా?
ఇక, రాయచోటి నుంచి తొలిసారి విజయం దక్కించుకుని…వైసీపీ కంచుకోటలో టీడీపీ జెండాను ఎగురవేసిన మండపల్లి రాంప్రసాద్ రెడ్డికి ప్రస్తుత పరిణామాలు.. ఒకింత సెంటిమెంటుగా మారాయి. దీంతోనే ఆయన రాయచోటిని జిల్లా కేంద్రం నుంచి తప్పిస్తుండడంతో కన్నీరు పెట్టుకున్నారు. అయితే.. ఇది తాత్కాలికమేనని అంటున్నారు పరిశీలకులు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది కాబట్టి.. అప్పటిలోగానే అన్ని పరిస్థితులు సరిదిద్దుకుంటాయని చెబుతున్నారు.అయితే.. ప్రజలకు నచ్చజెప్పడమే.. ఇప్పుడు మంత్రి ముందున్న ప్రధాన కర్తవ్యమని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates