ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ విభాగంలో మరో ముందడుగు వేసింది. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వేదికగా పోలీస్ శాఖకు సంబంధించిన కీలక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎఫ్‌ఐఆర్ నమోదు వివరాలు, ఎఫ్‌ఐఆర్ స్థితి, వాహనాలపై విధించిన ట్రాఫిక్ ఈ-చలాన్లను ఇకపై వాట్సాప్ ద్వారానే తెలుసుకునే అవకాశం కల్పించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సంక్రాంతి నాటికి అన్ని ప్రభుత్వ శాఖల సేవలను డిజిటల్ రూపంలో ప్రజలకు అందించాలన్న దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు శాఖల సేవలు మన మిత్ర ద్వారా అందుతుండగా, తాజాగా పోలీస్ శాఖ సేవలు కూడా ఈ వేదికలో చేరాయి. దీంతో పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందనున్నాయి.
ఈ సేవలను పొందాలంటే 95523 00009 నంబరును మొబైల్‌లో సేవ్ చేసి, వాట్సాప్‌లో ‘బీఖి’ అని మెసేజ్ పంపాలి. అనంతరం భాషను ఎంచుకుని పోలీస్ శాఖ సేవల విభాగంలోకి వెళ్లవచ్చు. అక్కడ ఎఫ్‌ఐఆర్, ఎఫ్‌ఐఆర్ స్థితి, ఈ-చలాన్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేస్తే పెండింగ్‌లో ఉన్న చలాన్ల వివరాలు తక్షణమే లభిస్తాయి. చలాన్లను ఆన్‌లైన్‌లోనే చెల్లించే సౌకర్యం కూడా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates