వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఎంపీ సంచలన ప్రకటన చేశారు. వచ్చే 2029 ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదన్నారు. అయితే.. ఇదేదో తాను ప్రజలకు వ్యతిరేకంగానో.. పార్టీకి వ్యతిరేకంగానో తీసుకున్న నిర్ణయం కాదని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి తన వారసుడు రంగంలోకి దిగుతున్నారని ఆయన ప్రకటించారు. ప్రజలు తన వారసుడిని తనను ఆశీర్వదించినట్టుగానే ఆశీర్వదించాలని ఆయన కోరారు. ప్రజల కోసం తమ కుటుంబం అనేక పనులు చేసిందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించామన్నారు. తాను ఇక, రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటాన్నానన్నారు.
ఆయనే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. దాదాపు మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న మాగుంట కుటుంబం.. లిక్కర్ వ్యాపారంలో అందెవేసిన చేయి. దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా కూడా మద్యం వ్యాపారం చేస్తున్నారు. మాగుంట కుటుంబం ఆది నుంచి కాంగ్రెస్‌లో ఉండగా.. రాష్ట్ర విభజన తర్వాత.. శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరారు. అయితే.. ఆ ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఆయన పోటీ చేసినా.. పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ బాటపట్టారు.
2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున ఒంగోలు నుంచి విజయం దక్కించుకున్నారు. మళ్లీ 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి.. మరోసారి గెలుపు గుర్రం ఎక్కారు. ఇక, వచ్చే ఎన్నికల్లో తన వారసుడు మాగుంట రాఘవరెడ్డిని నిలబెట్టాలన్నది ఆయన ఆలోచన. వాస్తవానికి వైసీపీలో ఉన్నప్పుడే.. రాఘవరెడ్డిని రాజకీయాల్లో యాక్టివ్ చేశారు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ, పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు మాగుంటకే మొగ్గు చూపారు. ఇక, ఇప్పుడు మూడు సంవత్సరాల ముందుగానే.. తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకువస్తున్నట్టు.. తాను రిటైర్ అవుతున్నట్టు శ్రీనివా సులు రెడ్డి ప్రకటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates