వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ఆలోచన.. ఆయన మనసులో కట్టుకుంటన్న అధికార పేకమేడలపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ముఖ్యంగా మేధావులు, విశ్లేషకులు.. జగన్ ఆలోచనా తీరును తప్పుబడుతున్నారు. ప్రధానంగా జగన్ ఎక్కడికి వెళ్లినా.. ఏం చేస్తున్నా.. ఆయన నోటి నుంచి వస్తున్న మాట.. “మళ్లీ అధికారం మనదే” అన్న వ్యాఖ్యే!. దీనిని ఆ పార్టీ నాయకులకు ఆయన నూరిపోస్తున్నారు. అయితే.. జగన్ ఉద్దేశం ఎలా ఉన్నప్పటికీ.. ఈ విషయంలో మంచి కన్నా చెడు ఎక్కువగా ఉందని అంటున్నారు.
జగన్ ఉద్దేశం ఏంటి?
ఎప్పుడు ఎన్నికలు జరిగినా మనమే వచ్చేస్తాం. మనదే అధికారం అని చెప్పడం వెనుక జగన్ ఉద్దేశం ఏంటన్నది ఆసక్తిగా మారింది. ఇది పార్టీ నాయకులకు ఆయన ఇస్తున్న బూస్ట్ అని కొందరు పరిశీలకులు చెబుతున్నారు. నిద్రాణంగా ఉన్న కార్యకర్తలను, నాయకులను యాక్టివేట్ చేసేందుకు జగన్ ప్రయోగిస్తున్న తారక మంత్రంగా భావిస్తున్నారు. తద్వారా వచ్చే ఎన్నికల వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు యాక్టివ్‌గా ఉంటారని జగన్ తలపోస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. ఇది కొంత మేరకు మంచిదే అయినా.. ఇదే పనిగా ప్రచారానికి పరిమితం కావడం సరికాదని అంటున్నారు.
కార్యకర్తల మాటేంటి?
ఇక, జగన్ చెబుతున్న మళ్లీ అధికారం మనదే అన్న వ్యాఖ్యలను కార్యకర్తలు, నాయకులు మరో కోణంలో అర్ధం చేసుకుంటున్నారని పరిశీలకులు చెబుతున్నారు. ఎలానూ వచ్చేది మన ప్రభుత్వమే కాబట్టి.. అన్న ధోరణిలో వారు వ్యవహరిస్తున్నారని.. రప్పా-రప్పా పోస్టర్లు పట్టుకుని తిరుగుతున్నారని చెబుతున్నారు. దీని వల్ల మరింతగా పార్టీ గ్రాఫ్ దెబ్బతింటోందని అంటున్నారు. కార్యకర్తలు-నాయకులకు ప్రజలకు చేరువగా ఉండాల్సింది పోయి.. వ్యతిరేక భావనతో రెచ్చిపోతున్నారన్న వాదనా వినిపిస్తోంది.
నేతి బీర చందమేనా?
జగన్ చెబుతున్నట్టుగా మళ్లీ అధికారం వైసీపీదేనా? అంటే.. ఎవరు మాత్రం చెప్పగలరు. ఇదేమీ తమిళ నాడు తరహా రాజకీయాలు ఉన్న రాష్ట్రం కాదు. పైగా.. ఒక పార్టీ ఐదేళ్ల టర్మ్ పూర్తి చేసుకున్నాక.. మరో పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది.. అని రాసుకున్న వీలు నామా కూడా ఏమీ ఉండదు. ఇది ప్రజాస్వామ్యం. ఎన్నికల సమయానికి ఏయే అంశాలు ప్రభావితం చూపుతాయో.. ఆయా అంశాల ఆధారంగానే పార్టీల అధికార స్వప్నాలు సాకారం అవుతాయి. సో.. వైసీపీ భావిస్తున్నట్టు లేదా ఆ పార్టీ అధినేత జగన్ చెబుతున్నట్టు వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అనేది నేతిబీర చందమేనని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates