వైసీపీ సీనియర్ నాయకుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఏసీబీ కోర్టులో కన్నీరు మున్నీరయ్యారు. తాజాగా వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన చెవిరెడ్డిని పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయనకు మరో 14 రోజలు పాటు రిమాండ్ విధించారు. అయితే.. ఈ సమయంలో చెవిరెడ్డి.. అనూహ్యంగా నోరు విప్పారు. న్యాయాధికారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. తనపై అనవసరంగా కేసు నమోదు చేశారని.. ఇది రాజకీయ కుట్రలో భాగమని చెప్పారు. ఇటీవల తన ఆస్తులను జప్తు చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
అయితే.. అవన్నీ తాను నీతి, నిజాయితీతో సంపాయించుకున్న ఆస్తులని.. ఒక్కరూపాయి కూడా అవినీతి లేదని చెవిరెడ్డి చెప్పారు. తన తాతతండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను తాను అభివృద్ది చేసుకున్నానని.. ఒకరిని అన్యాయం చేసి రూపాయి కూడా సంపాయించుకోలేదన్నారు. వీటిని జప్తు చేయడం ‘ధర్మం’ కాదని చెవిరెడ్డి చెప్పారు. కావాలంటే.. కూటమి ప్రభుత్వం ఎన్నాళ్లయినా.. తనను జైల్లో పెట్టుకోవచ్చన్నారు. తాను కూడా ఎన్నాళ్లయినా జైల్లో ఉండేందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నానని చెవిరెడ్డి చెప్పారు. అయితే.. ఈ విషయం తమ పరిధిలో లేదని.. సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేయాల్సి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.
అనంతరం.. మళ్లీ చెవిరెడ్డిని విజయవాడ జైలుకు తరలించారు. ఇదిలావుంటే.. ప్రభుత్వం ఇటీవల అక్రమ మద్యం వ్యవహారంలో చెవిరెడ్డి ఆస్తులను జప్తు చేసుకునేందుకు సిట్ అధికారులకు అనుమతి ఇచ్చింది. అయితే..దీనిపై న్యాయప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని చెవిరెడ్డి తరఫు న్యాయవాదులు తెలిపారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా.. కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ..ఇప్పటి వరకు కోర్టు నుంచి సిట్ అధికారులు అనుమతి తీసుకోలేదని చెప్పారు. ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసినప్పుడు తమ వాదనలు వినిపిస్తామని తెలిపారు. మరోవైపు.. ఇప్పటికే ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కసిరెడ్డి ఆస్తుల్లో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ప్రత్యేక దర్యాప్తు బృందం సీజ్ చేసిన విషయం తెలిసిందే.
దీనికి అప్పట్లో కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి ఆస్తులను సీజ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి కోరింది. దీనికి సర్కారు ఓకే చెప్పింది. దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత..ఆస్తులను సీజ్ చేయనున్నారు. మొత్తంగా 65 కోట్ల రూపాయల వరకు చెవిరెడ్డి ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉందని తెలిసింది. ఈ ఆస్తులను మద్యం అక్రమాల ద్వారా వచ్చిన సొమ్ములతోనే చెవిరెడ్డి కొనుగోలు చేశారని సిట్ అధికారులు చెబుతున్నారు. వీటిలో చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూములు, స్థిరాస్తులు ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates