ఏపీ రాజధాని అమరావతిలో మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి నుంచి రాజధానిలో ప్రారంభం కానున్న క్వాంటమ్ వ్యాలీలో తాను కూడా భాగస్వామ్యమయ్యేందుకు ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా ఏకంగా 1200 క్యూబిట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి గతంలోనే సీఎం చంద్రబాబు.. మైక్రోసాఫ్ట్‌తో జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయి. దీనిపై తాజాగా ప్రభుత్వానికి నివేదిక అందింది.
ఎంత పెట్టుబడి?
మైక్రోసాఫ్ట్.. రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసే 1200 క్యూబిట్ భారీ క్వాంటమ్ కంప్యూటర్ కోసం.. ఏకంగా 1,772 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. ఈ నిధులతో క్వాంటమ్ వ్యాలీలో 4 వేల చదరపు అడుగుల భవనాన్ని నిర్మించనున్నారు. తద్వారా.. స్థానికంగా ఐటీ చదివిన వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. తొలిదశలో 1500 మందిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటి వరకు చెన్నై, బెంగళూరులకు వెళ్లిన ఏపీ యువతకు.. ఇక్కడే అవకాశాలు లభించనున్నాయని పేర్కొంది.
ఇదే కాదు..
అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్‌ను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించిన తర్వాత.. ఆయన చొరవ తీసుకుని సంప్రదించిన కంపెనీలతో పాటు.. మరిన్ని సంస్థలు కూడా.. స్వచ్ఛందంగా వచ్చేందుకు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. వీటితో అంతర్జాతీయంగా కూడా ఏపీ రాజ ధాని పేరు మార్మోగనుంది. ప్రధానంగా జపాన్‌కు చెందిన కంపెనీలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టు సర్కారు పేర్కొంది.
ఇవీ.. వచ్చేవి..
1) జపాన్‌కు చెందిన ఫుజిసు ఐటీ కంపెనీ 64 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయనుంది.
2) కేంద్ర ప్రభుత్వం.. ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనుంది.
3) మైక్రోసాఫ్ట్ సహా.. గూగుల్ ప్రతిపాదిత కంపెనీలు రానున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates