ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్.. అక్కడి పెట్టుబడి దారులను ఆకర్షించే ప్రయత్నంలో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని.. పెట్టుబడి దారుల తో చర్చలు జరిపారు. తాజాగా మరో కీలక మైలురాయిని ఆయన చేరుకున్నారు. బ్రిస్బేన్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఏపీలో ఉన్న అవకాశాలను ఆయన వివరించారు. భారత్‌కు ఏపీ గేడ్‌వేగా మారిందని.. పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనలో ఏపీ ముందుందని వివరించారు.
అదేసమయంలో భారత్-ఆస్ట్రేలియా దేశాల మధ్య స్నేహ పూర్వక సంబంధాలు ఉన్నాయని తెలిపిన నారా లోకేష్.. పెట్టుబడి దారులకు అది కూడా కలిసి వస్తుందన్నారు. “ఏపీలో అనేక అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుని .. స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది మా ప్రభుత్వం. ఈ క్రమంలోనే పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నాం. రండి.. మీకు ఏ అవకాశం ఉన్న రంగంలో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.” అని నారా లోకేష్ పిలుపునిచ్చారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానాలను ఏపీలో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో సుపరిపాలన సాగుతోందని.. విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు కు ప్రపంచస్థాయి పేరుందని వివరించారు. గత 16 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు తీసుకువచ్చామని వివరించారు. గూగుల్ డేటా కేంద్రం కూడా విశాఖకు వచ్చేందుకు ఒప్పందం చేసుకుందని తెలిపారు.
ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న సులభతర విధానాలే ఇన్ని పెట్టుబడులు వచ్చేందుకు మార్గం సుగమం చేశాయని మంత్రి వెల్లడించారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ‘గేట్ వే’గా మారిందని మంత్రి నారా లోకేష్ వివరించారు. వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
