బాబు టార్గెట్‌: మిగిలింది 15 ల‌క్ష‌లే.. !

చేయాల‌న్న సంక‌ల్పం.. చిత్త‌శుద్ధి ఉంటే.. ఖ‌చ్చితంగా ఏ ప‌నిలో అయినా విజ‌యం ద‌క్కుతుంది. లేక‌పోతే.. తూతూ మంత్ర‌పు లెక్క‌లే మిగులాయి. గత ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ అధినేత‌గా ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబు.. యువ‌త‌కు పెద్ద పెట్టున భారీ హామీ ఇచ్చారు. అదే.. ఏటా 5 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ క‌ల్ప‌న‌. వ‌చ్చే ఐదేళ్ల‌లో మొత్తం 20 ల‌క్ష‌ల మంది నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని ప్ర‌చారం చేశారు. అన్న‌ట్టుగానే ప్ర‌భుత్వం ఏర్పాటు చేశారు. సీఎంగా ఆయ‌న వ‌స్తూ వ‌స్తూనే ఆయ‌న మెగా డీఎస్సీపై సంత‌కం చేశారు.

ఫ‌లితంగా 16 వేల పైచిలుకు ఉపాధ్యాయ కొలువుల‌ను భ‌ర్తీ చేసే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. వైసీపీ హ‌యాంలో ఒక్క‌సారి కూడా డీఎస్సీ వేయ‌ని విష‌యం తెలిసిందే. అంతేకాదు.. ఒక్క ఉపాధ్యా య పోస్టును కూడా భ‌ర్తీ చేయ‌లేక పోయారు. కానీ, కూట‌మిహ‌యాంలో మాత్రం 16 వేల పైచిలుకు ఉద్యోగాల‌కు నోటిఫికే ష‌న్ ఇచ్చి.. అనేక కోర్టు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి.. దీనిని పూర్తి చేశారు. గ‌త నెల‌లోనే 14 వేల పైచిలుకు ఉద్యోగుల‌కు అప్పాయింట్‌మెంటు లెట‌ర్లు కూడా ఇచ్చారు.

ఇదొక లెక్క‌. ఇవి కాకుండా.. ప్రైవేటులో ఎక్కువ భాగం ఉద్యోగాలు క‌ల్పించారు. పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించిన‌ కంపెనీలు త్వ‌ర‌లోనే ఏపీకి రానున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా కంపెనీల్లో 4ల‌క్ష‌ల 70 వేల‌కు పైగా ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. దీనిని కోట్ చేస్తూనే.. సీఎం చంద్ర‌బాబు ఇటీవ‌ల కాలంలో ప్ర‌క‌ట‌న‌లు చేస్తు న్నారు. త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన 15 మాసాల్లోనే 4.71 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను క‌ల్పించామ‌ని చెబుతున్నారు. దీనిని లెక్క‌ల ప‌రంగా చూసుకున్నా.. స‌రిపోతోంది. సో.. ఇక‌, మిగిలిన 15 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌న చేయాల్సి ఉంది.

దీనికి కూడా ప్ర‌భుత్వం వ‌ద్ద మాస్ట‌ర్ ప్లాన్ రెడీగా ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. న‌వంబ‌రు 14, 15 తేదీల్లో విశాఖ వేదిక‌గా.. పెట్టుబ‌డుల భాగ‌స్వామ్య స‌ద‌స్సును నిర్వ‌హించ‌నున్నారు. ఈ క్ర‌మంలో క‌నీసం లో క‌నీసం.. 9 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను క‌ల్పించే దిశ‌గా ప్ర‌భుత్వం ప్లాన్ చేసింద‌ని అంటున్నారు. ఇదే జ‌రిగితే .. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన కేవ‌లం 20 మాసాల్లోనే సుమారు 15 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చిన‌ట్టు అవుతుంది. ఇక‌, మిగిలిన మూడేళ్ల కాలంలో మిగిలిన ఉద్యోగాలు కూడా భ‌ర్తీ చేయ‌డం సునాయాసంగా జ‌రుగుతుంద‌ని అంటున్నారు. సో.. చేయాల‌న్న సంక‌ల్పానికి ఇది నిద‌ర్శ‌నంగా మారుతోంద‌ని చెబుతున్నారు.