ఏపీలోని కూటమి ప్రభుత్వ కీలక భాగస్వామ్య పార్టీ జనసేన ముఖ్య నాయకుడు, కొత్త ఎమ్మెల్సీగా ఇటీవల ఎన్నికైన కొణిదెల నాగబాబు.. తొలిసారి శాసన మండలిలోకి అడుగు పెట్టారు. గురువారం నుంచి అసెంబ్లీ, శాసన మండలి వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు.. నాగబాబు తొలిసారి వచ్చారు. దీనికి ముందు ఆయన.. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి.. పార్టీ అధినేత, తన సోదరుడు పవన్ కల్యాణ్‌ను కలుసుకున్నారు. మండలిలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు.
అనంతరం.. నాగబాబు మండలికి చేరుకున్నారు. అయితే.. ఆయన మండలి స్థానాల్లో చివరి వరసులో కూర్చున్నారు. అంతేకాదు.. సభలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ సభ్యులకు మధ్య జోరుగా వాదనలు జరిగినప్పుడు.. వాటిని మౌనంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కరేడు రైతులు.. సహా నెల్లూరులో ఎస్టీ మహిళ అరెస్టుకు సంబంధించిన అంశాలను వైసీపీ అభ్యర్థి ప్రస్తావించగా.. తీవ్ర వివాదం జరిగింది. ఈ సమయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానం ఇచ్చారు. అయితే.. పూర్తిగా తొలిరోజు.. నాగబాబు మౌనంగానే ఉండడం గమనార్హం.
ఇక, గత ఎన్నికల్లో విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీచేయాలని.. విజయం దక్కించు కోవాలని నాగబాబు ప్రయత్నించారు. అయితే. కూటమిలో భాగంగా ఆ స్థానం బీజేపీకి పోయింది. దీంతో ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఆ తర్వాత.. 8 మాసాలకు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నామని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే రెండు మాసాల కిందట ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి నాగబాబుకు కేటాయించారు. ఆయన విజయం దక్కించుకున్నారు.
మాట్లాడితే..
నాగబాబు వృత్తి రీత్యా నటుడే అయినా.. ఆయన లా చదివి ఉన్న నేపథ్యంలో ఆయన మాటలు సూటిగా ఉంటాయనే పేరుంది. విమర్శలు కూడా పదునుగానే ఉంటాయని అంటారు. కాబట్టి మండలిలో ఆయన ప్రజా సమస్యలపై మాట్లాడితే.. అంతే వాడి వేడిగా ఉండే అవకాశం ఉంటుందని జనసేన నాయకులు చెబుతున్నారు. కాగా, తొలి రోజు మాత్రం ఎవరి పక్కా కూర్చోకుండా.. విడిగా.. సభలో ఉన్న చివరి లైన్‌లో ఆయన ఒంటరిగా కూర్చుని సభా కార్యక్రమాలను వీక్షించడం వరకే పరిమితమయ్యారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates