‘జూబ్లీహిల్స్‌ మ‌దే.. స‌ర్వేలన్నీ మ‌న‌వైపే’

త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆయ‌న ఈ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన డివిజ‌న్ల నాయ‌కుల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా.. ఆయ‌న వారికి కొన్ని సూచ‌న‌లు, స‌ల‌హాలు చేశారు. ఇదే స‌మ‌యంలో బీఆర్ఎస్ స‌హా.. బీజేపీల వ్యూహాల‌పైనా వారితో చ‌ర్చించారు. ఆదివారం రాత్రి జ‌రిగిన ఈ స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ విజ‌యంపై ధీమా వ్య‌క్తం చేశారు. తాను అంత‌ర్గ‌తంగా ఈ నియోజ‌క‌వ‌ర్గం లో రాజ‌కీయ ప‌రిస్థితులు.. ప‌రిణామాల‌పై స‌ర్వే చేయించిన‌ట్టు చెప్పారు.

దీని ప్ర‌కారం.. కాంగ్రెస్ అభ్య‌ర్థే విజ‌యం ద‌క్కించుకుంటార‌ని స‌ర్వేలు తేల్చి చెప్పాయ‌న్నారు. ప్ర‌భుత్వం చేస్తున్న సంక్షేమ‌, ఉచిత ఆర్టీసీ బ‌స్సు, రైతుల‌కు మేళ్లు వంటివి క‌లిసివ‌స్తున్నాయ‌న్నారు. ముఖ్యంగా హైద‌రాబాద్ అభివృద్ధి స‌హా.. ఫ్యూచ‌ర్ సిటీ ప్లాన్ వంటివి ప్ర‌జ‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌ని.. దీంతో అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్న త‌మ‌కు ప్ర‌జ‌లు అనుకూలంగా ఉన్నార‌ని తెలిపారు. అయితే.. అలాగ‌ని నిర్ల‌క్ష్యంగా ఉండొద్ద‌ని నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు కూడా ఆయ‌న సూచించారు. ప్ర‌తి విష‌యాన్నీ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లాల‌న్నారు. హైద‌రాబాద్ అభివృద్ధి స‌హా.. ఫ్యూచ‌ర్ సిటీ అంశాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌న్నారు.

ఇదేస‌మ‌యంలో సీఎం రేవంత్ రెడ్డి.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ అవినీతి, అక్ర‌మాల‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లాల‌ని సూచించారు. హైద‌రాబాద్ అభివృద్ధికి కేవ‌లం కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే ప‌నిచేసింద‌న్నారు. గ‌తంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేద‌న్నారు. శంషాబాద్ విమానాశ్ర‌యం స‌హా.. ర‌హ‌దారుల వెడ‌ల్పు వంటివి కాంగ్రెస్ హ‌యాంలోనే జ‌రిగాయ‌న్నారు. అదేవిధంగా రైతుల‌కు రుణ మాఫీ చేశామ‌న్నారు. బీఆర్ ఎస్ స‌హా బీజేపీల‌కు హైద‌రాబాద్ అభివృద్ధిలో ఎలాంటి పాత్ర లేద‌ని.. కానీ, వారు చెప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో వారి ప్ర‌చారాన్ని తిప్పికొట్టాల‌ని సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు.

వార్డుల వారీగా ప్ర‌చారం..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వార్డుల వారీగా ప్ర‌జ‌ల‌ను క‌లిసి ప్ర‌చారం చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్ర‌తి ఇంటినీ సంద‌ర్శించాల‌న్నారు. ప్ర‌తి ఓటూ కాంగ్రెస్‌కు ప‌డేలా చూడాల‌ని తెలిపారు. బూతుల వారీగా ప్ర‌చారం నిర్వ‌హించేందుకు బ్లూ ప్రింట్ రెడీ చేసుకోవాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్య‌క్ర‌మాల ప్ర‌చారంతోపాటు స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను కూడా తెలుసుకుని.. వాటిని ప‌రిష్క‌రించేందుకు భ‌రోసా ఇవ్వాల‌ని సూచించారు. ప్ర‌తి విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుని ముందుకు సాగాల‌ని నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు.