వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మానసిక స్థితి సరిగాలేదని అన్నారు. ఆయన ఓకే అంటే.. ఏదైనా ఆసుపత్రిలో చూపిస్తామన్నారు. తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడిన గంటా.. జగన్ కు పొరపాటున 11 సీట్లు ఇచ్చామని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. దీనివల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని బాధ పడుతున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఈ మాత్రం కూడా రావని.. ఒకటో.. రెండో సీట్లు మాత్రమే దక్కుతాయని తెలిపారు.
ఇక, వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలను గంటా ఖండించారు. ప్రైవేటు పరం చేయడం లేదని.. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంచి.. వాటి నిర్మాణాలను మాత్రమే ప్రైవేటుకు ఇస్తామన్నారు. పీపీపీ అంటే కూడా జగన్‌కు తెలియకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. పైగా.. కాంట్రాక్టు తీసుకునే వారిని ఆయన బెదిరిస్తున్నారని.. విధ్వంసకర వ్యాఖ్యలతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. యూరియా విషయంలో జగన్ చేసిన విమర్శలు సరికావని తెలిపారు. పైగా.. సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, అచ్చెన్నాయుడు లను బావిలో దూకాలని అనడం దారుణమన్నారు.
ఈ వ్యాఖ్యలు చేస్తూ.. జగన్ తన మానసిక పరిస్థితిని బయట పెట్టుకున్నట్టుగా ఉందన్నారు. ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకా బయటకు వచ్చినట్టే కనిపించడం లేదన్నారు. అందుకే.. ఆయన ఓకే అంటే.. ఏదైనా ఆసుపత్రిలో చూపి స్తామని గంటా వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో 10 శాతం సీట్లు ఉంటే తప్ప.. ప్రధాన ప్రతిపక్ష హోదా రాదన్నారు. ఈ విషయం జగన్ కు కూడా తెలుసునని.. అయినా యాగీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయన బెదిరింపులకు ఎవరూ భయపడబోరని తెలిపారు.
జగన్ అసెంబ్లీకి రాకుండా.. మీడియా ముందు హెచ్చరికలు, బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సిన అంశమని గంటా వ్యాఖ్యానించారు. కానీ, జగన్‌కు ప్రజలు సీట్లే ఇవ్వనప్పుడు.. హోదా ఎక్కడి నుంచి అడుగుతారని.. ఎవరిని అడుగుతారని దుయ్యబట్టారు. 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి విశాఖలో నిర్మించిన ప్యాలెస్ ఎవరి కోసం కట్టారో.. ఇప్పటికైనా జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజా ధనం వృధా కాదా? అని ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates