బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనలో జరిగిన ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు గతంలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. అవసరం లేకుండానే.. నిర్వహణ కంపెనీకి నిధులు మంజూరు చేశారని.. ఈ విషయంలో అప్పటి మంత్రి, బీఆర్ ఎస్ నేత కేటీఆర్‌కు ప్రమేయం ఉందని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. దీనిపై విచారణకు ఆదేశించింది. ఈ కేసును ఏసీబీకి అప్పగించారు. దీంతో మాజీ మంత్రి కేటీఆర్ సహా.. అప్పటి అధికారులు.. అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను కూడా విచారించారు. అదేవిధంగా దిగువ శ్రేణి సిబ్బందిని కూడా ఏసీబీ అధికారులు విచారించారు.
అయితే.. అప్పట్లో ఈ కేసుపై కేటీఆర్.. తీవ్ర విమర్శలు చేశారు. ఇది రాజకీయ కుట్రతో తనను ఇబ్బంది పెట్టాలని చేస్తున్న కేసు గా ఆయన పేర్కొన్నారు. ఇదిలావుంటే.. ఆనాటి విచారణకు సంబంధించి ఏసీబీ అధికారులు తాజాగా తమ నివేదికను ప్రభుత్వానికి అందించారు. సుమారు 1000 పేజీలతో కూడిన నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. దీనిలో ప్రధానంగా కేటీఆర్‌ను ఏ-1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను ఏ-2గా, అప్పటి హైదరాబాద్ మెట్రో అభివృద్ధి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డిని ఏ-3గా పేర్కొన్నారు. మొత్తంగా వీరి ప్రమేయాన్ని కూలంకుషంగా నివేదికలో వివరించారని తెలుస్తోంది.
10 కోట్ల రూపాయలు..
ఈ-ఫార్ములా రేస్ కేసులో మొత్తంగా 10 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందన్నది ప్రభుత్వం చెబుతున్న మాట. విదేశీ కంపెనీలకు.. ఈ సొమ్మును అనవసరంగా కట్టబెట్టారని, దీనిలో అప్పటి మంత్రి కేటీఆర్‌కు కొంత సొమ్ము ముట్టిందన్నది కూడా ప్రధాన ఆరోపణ. ఇదిలావుంటే.. తాజాగా ఇచ్చిన ఏసీబీ నివేదికలో విచారణకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని సర్కారుకు వదిలి పెట్టారు. ప్రభుత్వం కనుక దీనిపై గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. తదుపరి విచారణతోపాటు.. కోర్టులో చార్జిషీట్లను కూడా దాఖలు చేసే అవకాశం ఉంటుంది. దీంతో ఇది కేటీఆర్‌కు మరింత ఇబ్బంది కలిగించే అంశమని అంటున్నారు. ఒకవైపు కేసీఆర్, హరీష్‌రావులపై కాళేశ్వరం కేసు వెంటాడుతుండగా.. కేటీఆర్‌కు పోన్ ట్యాపింగ్ సహా ఈ ఫార్ములా రేస్ కేసు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates