ఏపీ స‌ర్కారుకు.. ‘తుర‌క‌పాలెం’ మ‌ర‌క‌!

ఏపీ ప్ర‌భుత్వానికి.. గుంటూరు జిల్లా తుర‌క‌పాలెంలో జ‌రుగుతున్న భారీ మ‌ర‌ణాలు మ‌ర‌క‌లుగా మారుతు న్నాయి. గ‌త నెల రోజుల వ్య‌వ‌ధిలో 80 మందికి పైగా ఇక్క‌డి ప్ర‌జ‌లు మృతి చెందారు. అంతు చిక్క‌ని జ్వ‌రాల‌తో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. ఈ జ్వ‌రాల బారిన ప‌డిన‌వారు.. అతిత‌క్కువ కాలంలోనే మృతి చెందుతున్నారు. దీనిపై ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు వ‌స్తున్నా.. పెద్ద‌గా ప్ర‌భుత్వం స్పందించ‌డం లేద‌న్న విమ‌ర్శ లు వ‌స్తున్నాయి.

గుంటూరు జిల్లా తురకపాలెంలో ప్రబలిన విషజ్వరాలకు కారణం మెలిడియోసిస్ బ్యాక్టీరియానేనని వైద్యులు స్పష్టం చేశారు. ఈ బ్యాక్టీరియా మనిషి శరీరంలో పరిపక్వత చెందిన తరువాతే గుర్తించగలమని, అత్యంత అరుదైనది అయినందున దీనిని గుర్తించటం ఆలశ్యమైందని వివరించారు. బాధితులకు, మృతులకు ఆసుపత్రి ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిధి నుండి అందిస్తున్నారు. అలాగే స్థానికంగా వైద్య శిబిరాల‌ను ఏర్పాటు చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డి స‌మ‌స్య కొలిక్కిరాలేదు.

సీఎం స్పంద‌న ఏంటి?

తుర‌కపాలెంలో జ‌రుగుతున్న వ‌రుస మ‌ర‌ణాల‌పై సీఎం చంద్ర‌బాబు స్పందించారు. అయితే.. దీనికి ప‌రిష్కారం క‌నుగొన‌లేక‌పోతున్నామ‌ని వైద్య శాఖ చెప్ప‌డంతో ఆయ‌న కేంద్రం నుంచి వైద్యుల‌ను తీసుకువచ్చే అంశంపై దృష్టి పెట్టాల‌ని.. అవ‌స‌ర‌మైతే.. అఖిల భార‌త వైద్య మండ‌లి సేవ‌లు వినియోగించుకోవాల‌ని సూచించారు. ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన 80 మంది కుటుంబాల‌కు ఒక్కొక్క కుటుంబానికీ 5 ల‌క్ష‌ల చొప్పున సాయం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. స‌మ‌స్య ప‌రిష్కారం కోసం.. హైద‌రాబాద్‌లోని నిపుణుల‌ను కూడా సంప్ర‌దించాల‌ని చంద్ర‌బాబు కోరారు.