ఔను! మీరు చదివింది నిజమే. నిన్న మొన్నటి వరకు రాజకీయ కాకతో రగిలిపోయిన ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలక నియోజకవర్గం తాడిపత్రిలో రాజకీయాలు దాదాపు సర్దుకున్నట్టు తెలుస్తోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య నెలకొన్న ఘర్షణలతో దాదాపు ఐదేళ్లకుగానే.. కాక రేపుతున్న ఈ నియోజకవర్గంలో ఒప్పందం కుదిరినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీనికి ప్రాతిపదిక.. అమరావతేనని అంటున్నారు. కీలక నేతల మధ్య ఇక నుంచి ఇబ్బందులు రాకుండా ‘ఒప్పందం’ కుదిరినట్టు తెలుస్తోంది.
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య వివాదం ముసురుకున్న విషయం తెలిసిందే. తన హయాంలో జేసీపై పలు కేసులు పెట్టించారని పెద్దారెడ్డిపై జేసీ వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు అధికారం మారిన తర్వాత.. ఇరు పక్షాల మధ్య మరింత ఎక్కువగా రాజకీయాలు సాగుతున్నాయి. ఈ సమయంలో ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుకోవడంతోపాటు సవాళ్లు-ప్రతిసవాళ్ల దిశగా కూడా.. రాజకీయాలు సాగాయి.
పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి అడుగు పెట్టకుండా చేస్తానని జేసీ సవాలు చేయడం.. ఎలా రాకుండా చూస్తావోనని పెద్దారెడ్డి ప్రతిసవాల్ చేయడం తెలిసిందే. ఈ వ్యవహారం నిరంతరం రాజకీయ సంఘర్షణ లకు దారి తీసింది. ఇటీవల సుప్రీంకోర్టు వరకు కూడా ఈ విషయం చేరింది. పెద్దారెడ్డిని నియోజకవర్గం లోకి అనుమతి ఇస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇది జరిగిన తర్వాత.. అనూహ్యంగా పరిణామాలు మారాయి. అమరావతి వేదికగా.. కీలక నాయకుల జోక్యంతో ఇరు పక్షాల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది.
దీనిని బట్టి.. గతంలో పెద్దారెడ్డి జేసీపై పెట్టిన అన్ని కేసులను ఉపసంహరించుకునేందుకు.. పెద్దారెడ్డికి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. నియోజకవర్గంలో ఆయన వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండేందుకు ఇరు పక్షాల మధ్య టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు, మంత్రి ఒకరు ఒప్పందం చేసినట్టు తెలిసింది. ఇది కూడా సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని.. ఉభయ పక్షాలను సర్దుబాటు చేసినట్టు సమాచారం. రగడ పెంచుకుంటూ.. పోతే తమకు ఇబ్బంది అవుతుందని.. ఇప్పటికే నష్టం చాలానే జరిగిందని.. జేసీ కూడా అంగీకరించిన దరిమిలా.. ప్రస్తుతం చేసుకున్న ఒప్పందం మేరకు ఉభయ పక్షాలు ఒక నిర్ణయానికి వచ్చాయని అంటున్నారు. దీంతో ప్రస్తుతం తాడిపత్రిలో నెలకొన్న రాజకీయ రచ్చ కొంత వరకు సర్దు బాటు అయిందని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates