ప‌నిమంతుడు: పొగ‌డ్త‌ల‌కు ప‌డిపోని పెమ్మ‌సాని…!

రాజ‌కీయాల్లో ఉన్న వారికి ప‌ని ఎలా ఉన్నా.. పొగ‌డ్త‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. నువ్వంతంటే.. నువ్వింత .. అని అనేవారిని అక్కున చేర్చుకుని మ‌చ్చిక చేసుకునేందుకు నాయ‌కులు ఫ‌స్ట్ ప్రియార్టీఇస్తున్నారు. రాజకీయాలు ఒక‌ప్పుడు ఎలా ఉన్నా.. ఇప్పుడు నేత‌ల‌ను పొగ‌డ‌క‌పోతే.. ప‌నులు జ‌రిగే ప‌రిస్థితి లేకుండా పోయింది. అయితే.. అంద‌రూ అలానే ఉంటారా? అంటే.. ఒక‌రిద్ద‌రు పొగ‌డ్త‌ల‌కు దూరంగా కూడా ఉంటా రు. ఇలాంటి వారిలో గుంటూరు ఎంపీ పేరు మార్మోగుతోంది.

గ‌త ఎన్నిక‌ల్లో ఫ‌స్ట్ టైమ్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. ఫ‌స్ట్ టైమ్ గుంటూరు ఎంపీ సీటును ద‌క్కించుకున్న పెమ్మ సాని చంద్ర‌శేఖ‌ర్‌.. ప్ర‌స్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈయ‌న త‌ర‌చుగా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. స‌మ‌స్య‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వాటిని ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నంలోనూ ఉన్నారు. అయితే.. సుదీర్ఘ అనుభ‌వం ఉన్న రాజ‌కీయ నేత‌లు.. ఈయ‌న‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప‌లు విధాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కేంద్రంలో కూడా చ‌క్రం తిప్పుతున్న నేప‌థ్యంలో ఈయ‌న‌ను మ‌చ్చిక చేసుకుంటే.. త‌మ‌కు ప‌నులు అవుతాయ‌ని వారు భావిస్తున్నారు.

ఇటీవ‌ల మంత్రి త‌న నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చిన‌ప్పుడు.. ఆయ‌న పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని భారీ కార్య‌క్ర‌మానికి ఓ నాయ‌కుడు ప్ర‌య‌త్నించారు. ఈయ‌న ప్ర‌ముఖ కాంట్రాక్ట‌ర్ కూడా. రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వాలు కాంట్రాక్టు ప‌నులు చేస్తుంటారు. దీంతో త‌న ప‌నుల కోస‌మైనా.. ఆయ‌న నాయ‌కుల‌ను మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తారనే పేరుంది. గ‌తంలో ఎంపీగా ప‌నిచేసిన గ‌ల్లా జ‌య‌దేవ్‌ను కూడా స‌ద‌రు నేతే.. ఆకాశానికి ఎత్తేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. పుట్టిన రోజుల సంద‌ర్భంగా భారీ యాడ్స్ ఇవ్వ‌డం.. ఘ‌న స‌న్మానాలు చేయ‌డంలో దిట్ట‌గా కూడా పేరుంది.

ఇప్పుడు ఆయ‌నే పెమ్మ‌సానిని కూడా మంచి చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని రెండు రోజుల కింద‌ట ఘ‌న స‌న్మానం చేయాల‌ని ఏర్పాట్లు చేసుకున్నారు.. కానీ, ఈ విష‌యం తెలిసిన కేంద్ర మంత్రి.. త‌న ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకున్నారు. స‌న్మానాలు.. స‌త్కారం త‌న‌కు అవ‌సరం లేద‌ని.. నియోజ‌క‌వ‌ర్గంలో పీ-4 కింద ఓ రెండు కుటుంబాల‌ను ద‌త్త‌త తీసుకోవాల‌ని ఆయ‌న మేలైన సూచ‌న చేశార‌ట‌.

అయితే.. స‌ద‌రు కాంట్రాక్ట‌ర్ మాత్రం స‌న్మానం వైపే మొగ్గు చూప‌డంతో కేంద్ర మంత్రి ఇలా అయితే.. ఇక నుంచి నా ప‌ర్య‌ట‌న‌ల‌కు మీరు రావొద్ద‌ని తేల్చి చెప్పేయ‌డంతో ఇప్పుడు ఆ కాంట్రాక్ట‌ర్ త‌న ప‌నితీరు మార్చుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని స‌మాచారం. మొత్తానికి ప‌నితీరుకే పెద్ద పీట వేసే నాయ‌కులు క‌నుమ‌రుగుతున్న స‌మ‌యంలో పెమ్మసాని త‌నేంటో చూపించార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.