రాజకీయాల్లో ఏ సందేహం అయితే రాకూడదో.. ఏ విషయం ఎక్కువగా ప్రచారం కాకూడదో.. ఇప్పుడు వైసీపీ విషయంలో అదే ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్.. ఏపీలో ఉన్నారో.. బెంగళూరులో ఉన్నారో తెలియక.. కొందరు నాయకులు సతమతం అయ్యే పరిస్థితి వచ్చింది. ఎన్నికలు జరిగి ఏడాదిన్నర అయిన తర్వాత కూడా.. ఈ సందేహాలు.. వైసీపీలోనే వస్తున్నాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనికి కారణం.. జగన్ చేతులు ముడుచుకుని.. ఇంట్లోనే కూర్చోవడమే!
ఏం జరిగింది?
వైసీపీలో కొందరు నాయకులు.. జగన్‌ను కలుసుకోవాలని భావించారు. పార్టీ సంస్థాగత కార్యాచరణ, సహా ఇంకా ఉపేక్షిస్తూ కూర్చుంటే.. పార్టీపై వ్యతిరేకతను అధికారపక్షం మరింత పెంచుతోందని నాయకులు తల్లడిల్లుతున్నారు. రాజకీయంగా వారంటూ కొన్ని కార్యక్రమాలు నిర్దేశించుకుని.. వాటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వాటికి సంబంధించిన వివరాలను అధినేత చెవిలో వేసి.. మార్పులు చేర్పులు చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.
అయితే.. ఎటొచ్చీ.. జగన్ ఏపీలో ఎప్పుడు ఉంటున్నారో.. బెంగళూరుకు ఎప్పుడు వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి సొంత నాయకులకు కూడా ఏర్పడింది. కనీస సమాచారం కూడా ఉండడం లేదని మీడియా వద్ద నాయకులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే కొందరు నాయకులు తాడేపల్లి ఆఫీసుకు ఫోన్లు చేసే పరిస్థితి వచ్చింది. అయితే.. చిత్రంగా ఇక్కడ కూడావారికి సరైన సమాధానం లభించడం లేదు. మీకెందుకు? అనే మాటే వినిపిస్తోంది. దీంతో నాయకులు ఇబ్బంది పడుతున్నారు.
ఇక, జగన్ వైఖరి గమనిస్తే.. ఆయన ప్రజల్లోకి రావడం ఇప్పట్లో లేదని తేల్చేశారు. కేవలం చేతులు ముడుచుకుని ఇంట్లోని ఆఫీసు నుంచే మీడియాతో మాట్లాడుతున్నారు. అది కూడా ఒకటి రెండు సార్లు మాత్రమే. ఎక్కువగా సోషల్ మీడియా వేదికగానే స్పందిస్తున్నారు. అది ఎక్కడ నుంచి స్పందిస్తున్నారో కూడా తెలియడం లేదు. ఈ కామెంట్లు, విమర్శలు ప్రజల మధ్యకు ఏమాత్రం చేరడం లేదన్నది సీనియర్లు చెబుతున్న మాట. అందుకే.. తమ తమ నియోజకవర్గాల్లో వినాయకచవితి తర్వాత ప్రచారం చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates