‘జగన్ అంటే అసహ్యం వేస్తోంది. ఇంత నిర్లజ్జగా మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు.’ అని టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రజాస్వామ్యం గురించి, విలువ గురించి.. ఆయన మాట్లాడుతుంటే.. అసహ్యంగా ఉందన్నారు. తాజాగా స్పీకర్ అయ్యన్న సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పులివెందుల, ఒంటిమిట్టల్లో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలను ఆయన ప్రస్తావించారు. ప్రజలు స్వయంగా చెబుతున్న దాని ప్రకారం.. ఇక్కడ 30 ఏళ్ల తర్వాత స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయన్నారు.
అయినా.. జగన్ ఏదో జరిగిపోయిందని వ్యాఖ్యలు చేస్తుంటే.. అసహ్యంగా అనిపిస్తోందని అయ్యన్న వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును అందరూ గౌరవించాలన్న ఆయన.. దీనికి విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలు అత్యంత అసహ్యంగా ఉన్నాయన్నారు. వైసీపీ హయాంలో ఎన్ని అరాచకాలు జరిగాయో.. గుర్తులేదా? అని ప్రశ్నించారు. కనీసం నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకుని.. రక్తపాతం సృష్టించారని గుర్తు చేశారు.
పులివెందుల ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత జగన్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు. “నువ్వు నరకానికి పోతావ్” అంటూ.. చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు అందరూ ఖండించాలని.. జగన్‌కు బుద్ది వచ్చేలా చేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి వారు ప్రజాస్వామ్యానికి భారమని వ్యాఖ్యానించారు. అందుకే పులివెందుల ప్రజలు స్వేచ్ఛను కోరుకున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో విజయం దక్కించుకున్న వారికి అభినందనలు తెలిపారు.
వస్తారా? రారా?
ఇదిలావుంటే.. వచ్చే నెలలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయని స్పీకర్ అయ్యన్న తెలిపారు. మరి ఈ సమావేశాలకైనా వైసీపీ నాయకులు వస్తారో రారో తేల్చుకోవాలని చెప్పారు. వస్తే.. రెండు ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఇస్తామన్న ఆయన.. వైసీపీ రాకపోతే.. ఆ రెండు ప్రశ్నలను వేరే పార్టీ సభ్యులకు కేటాయిస్తామని చెప్పారు. అసెంబ్లీకి రాకుండా ప్రశ్నలు వేసే సంస్కృతి ఇక నుంచి ఉండబోదని హెచ్చరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates