ఎగువన ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా.. కృష్ణానదికి నీటి జోరు పెరిగింది. అంతేకాదు.. ఇరు తెలుగు రాష్ట్రాల జలవనరుల శాఖ నిపుణులు చెబుతున్న లెక్కల ప్రకారం.. దాదాపు 18 సంవత్సరాల తర్వాత.. ఆ స్థాయిలో ఇప్పుడు కృష్ణమ్మకు నీటి ప్రవాహం పెరిగిందని చెబుతున్నారు. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేశారు. అయితే.. దీనిపై ఏపీలోనూ కూటమి ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తోంది.
సహజంగా చంద్రబాబు అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో కరువు వస్తుందని వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తారు. బాబుతో పాటు కరువు కూడా కలిసి వస్తుందన్న వ్యంగ్యాస్త్రాలు విసురుతారు. దీనిని ఇప్పుడు బ్రేక్ చేస్తూ.. కృష్ణా పరివాహక ప్రాంతంలో కీలకమైన ఖరీఫ్ సీజన్‌లో కృష్ణమ్మకు వరద పోటెత్తింది. ఈ పరివాహక ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టులు కూడా కళకళలాడడంతోపాటు.. పూర్తిగా నీటి మట్టాలు నిల్వ చేసేందుకు అవకాశం ఉంటుందని కూడా అధికారులు చెబుతున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టులోకి మంగళవారం 2,39,601 క్యూసెక్కుల నీరు చేరగా.. 2,29,743 క్యూసెక్కుల నీటిని నాగార్జు సాగర్ కు విడుదల చేశారు. తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్డూరి లక్ష్మణ్ సాగర్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ నుంచి 1,18,790 క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేశారు. పులిచింతల ఇప్పుడు 30,222 క్యూసెక్కులు ఇన్ ఫ్లో, 18,000 క్యూసెక్కుల అవుట్ ఫ్లోకు చేరుకుంది. ప్రస్తుతం పులిచింతలలో 28.6 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
మరో 17 టీఎంసీలు నీరు చేరగానే పులిచింతల నిండిపోతుంది. ఇక ప్రకాశం బ్యారేజీకి నీటిని వదులుతారు. ఫలితంగా.. విజయవాడ నుంచి ఉయ్యూరు వరకు ఉన్న పంటలు, అటు గుంటూరు పరివాహక ప్రాంతంలోని సాగుకు కూడా కావాల్సినంత నీరు అందుతుందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates