జగన్‌ ఇంటికెళ్తే.. వైసీపీ కండువా వేసేశారట

లెజెండరీ నటి జయసుధ నట వారసత్వాన్ని అందుకుంటూ సినిమాల్లోకి అడుగు పెట్టారు ఆమె తనయులు నిహార్ కపూర్, శ్రేయాన్ కపూర్. ఐతే వీరిలో శ్రేయాన్ హీరోగా ‘బస్తీ’ అనే ఒక సినిమా చేసి తెరమరుగు అయ్యాడు. నిహార్ మాత్రం నెగెటివ్, క్యారెక్టర్ రోల్స్‌తో టాలీవుడ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’లో అతను ఓ కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. 

‘బాహుబలి’లో భల్లాలదేవ పాత్ర తాను చేయాల్సిందని.. అందుకోసం కొన్ని రోజులు ట్రైనింగ్ కూడా తీసుకున్నానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఓ సంచలన విషయం కూడా చెప్పాడు నిహార్. ఆ అవకాశం మిస్ అయినప్పటికీ.. ‘వీరమల్లు’తో వచ్చిన గుర్తింపుతో మరిన్ని అవకాశాలు అందుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా మరో ఇంటర్వ్యూలో రాజకీయాలకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయటపెట్టాడు నిహార్ కపూర్.

గతంలో జయసుధ, నిహార్ కలిసి ఒకసారి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆయన ఇంట్లో కలిశారు. అప్పుడు వాళ్లిద్దరూ మెడలో వైసీపీ కండువాలతో కనిపించడంతో ఆ పార్టీలో చేరారని అంతా అనుకున్నారు. కానీ జయసుధ కానీ, నిహార్ కానీ.. ఆ పార్టీ కోసం ఎన్నికల ప్రచారంలో ఏమీ పాల్గొనలేదు. జయసుధకు వైఎస్ అంటే అభిమానం అన్న సంగతి తెలిసిందే. ఆయన ఉండగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ వైసీపీలో మాత్రం అధికారికంగా చేరినట్లు సమాచారం ఏదీ బయటికి రాలేదు. 

మరి ఆ కండువాల సంగతేంటి అని ఈ ఇంటర్వ్యూలో నిహార్‌ను అడిగితే ఆశ్చర్యపరిచే విషయం చెప్పారు. జగన్‌ను కలవడానికి ఆయన ఇంటికి వెళ్తే వైసీపీ కండువాలు తెచ్చి మెడలో వేసేశారని.. అలాగే ఫొటోలు కూడా తీశారని అతను చెప్పాడు. అంతే తప్ప తాము వైసీపీలో చేరలేదని అతనన్నాడు. జగన్ ఇంటికి వెళ్లిన అందరికీ ఇలా కండువాలు వేస్తారన్నట్లుగా అతను మాట్లాడ్డం గమనార్హం. దీంతో ఇదేం సంప్రదాయం అంటూ వైసీపీ వాళ్ల తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు.