ప్ర‌స‌న్న కుమార్‌ను అరెస్టు చేయ‌లేదు…

వైసీపీ నాయ‌కుడు, నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి శుక్ర‌వారం పోలీసుల ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. నెల్లూరు రూర‌ల్ డీఎస్పీ ఆఫీసులో జ‌రిగిన విచార‌ణ‌కు ఉద‌యం 11 గంట‌ల‌కు హాజ‌రైన ఆయ‌న‌ను రెండు గంట‌ల పాటు పోలీసులు విచారించారు. అయితే.. ఆయ‌న‌ను అరెస్టు చేస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. దీంతో వైసీపీ నాయ‌కులు, ప్ర‌స‌న్న కార్య‌క‌ర్త‌లువంద‌ల సంఖ్య‌లో డీఎస్పీ కార్యాల‌యానికి చేరుకున్నారు.

కానీ, రెండు గంట‌ల విచార‌ణ తర్వాత పోలీసులు ప్ర‌స‌న్న‌ను అరెస్టు చేయ‌కుండా వ‌దిలేశారు. గ‌తంలో సుప్రీంకోర్టు.. అర్నేష్ కుమార్ వ‌ర్సెస్ బీహార్ ప్ర‌భుత్వం కేసులో ఇచ్చిన తీర్పును అనుస‌రించి.. 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. ఇది గృహ హింస‌కు సంబంధించిన కేసు. ఎలా ప‌డితే అలా అరెస్టు చేయ‌డానికి వీల్లేద‌ని.. సుప్రీంకోర్టు తీర్పు చెబుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం విచార‌ణ‌కు మాత్ర‌మే పిలిచామ‌ని పోలీసులు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ను 40 ప్ర‌శ్న‌లు అడిగిన‌ట్టు అధికారులు తెలిపారు.

ఇదే విష‌యాన్ని ప్ర‌సన్న‌కుమార్ రెడ్డి కూడా మీడియాకు చెప్పారు. త‌న‌ను 40 ప్ర‌శ్న‌లు అడిగార‌ని.. కొన్నింటికి లిఖిత పూర్వ‌క జ‌వాబు కావాల‌ని కోరార‌ని.. దీంతో లిఖిత పూర్వ‌కంగా వారికి స‌మాధానం చెప్పానన్నారు. తాను ఏ త‌ప్పూ చేయలేద‌న్నారు. ఉన్న‌దే మాట్లాడాన‌ని గ‌తంలో చేసిన విమ‌ర్శ‌ల‌ను మ‌రోసారి స‌మ‌ర్థించుకున్నారు. అయితే.. త‌న‌కు మ‌హిళ‌ల‌ప‌ట్ల గౌర‌వం లేద‌ని కొంద‌రు ప్ర‌చారం చేశార‌ని.. ఇలాంటి వారిని ఉపేక్షించేది లేద‌ని ఆయ‌న ప‌రోక్షంగా టీడీపీ నాయ‌కుల‌ను హెచ్చ‌రించారు.

ఏంటీ కేసు?

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి.. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌స‌న్న కుమార్ రెడ్డిని ఓడించి గెలుపు గుర్రం ఎక్కారు. దీనికి ముందు.. నుంచి వీరి కుటుంబాల మ‌ధ్య సంబందాలు కూడా ఉన్నాయి. ప్ర‌శాంతి రెడ్డి ప్ర‌స‌న్న‌కు బందువు అవుతారు. అయితే.. ఆమెపై అనూహ్యంగా తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తూ.. బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా దుమారం రేపాయి. ప్ర‌తిగా టీడీపీ కార్య‌క‌ర్త‌లు కొంద‌రు ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి ఇంటిపై దాడి చేసి.. ఫ‌ర్నిచ‌ర్‌ను ధ్వంసం చేశారు. కోర్టు జోక్యంతో పోలీసులు కేసు న‌మోదుచేసి ప్ర‌స‌న్న‌ను విచార‌ణ‌కు పిలిచారు. అయితే.. ఇదే తొలి విచార‌ణ అని.. మ‌లి విచార‌ణ‌కు కూడా పిలుస్తామ‌ని పోలీసులు చెప్పారు.