ఏపీ మంత్రి పొంగూరు నారాయణ అంటే.. నిదానస్తుడు.. నిర్మాణాత్మకంగా వ్యవహరించే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇతర మంత్రుల మాదిరిగా ఆయనకు నోరు చేసుకునే అలవాటు.. తొందర పడే ధోరణి కూడా లేదు. అలాంటి మంత్రి.. అదుపు తప్పారు. మీడియా చూస్తోందని కూడా ఆయన మరిచిపోయినట్టుగా ఉన్నారు. అమరావతి పనుల్లో ఓ ఇంజనీర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూజ్‌లెస్ ఫెలో అంటూ వ్యాఖ్యానించారు. గెటౌట్.. అని గద్దించారు. ఈ వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో రచ్చ రేపుతున్నాయి.
ఏం జరిగింది?
అమరావతి రాజధానిలో నిర్మాణాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించింది. వీటిలో నవ నగరాల నిర్మాణం ఎలా ఉన్నా.. ఐఏఎస్, ఐపీఎస్, సహా ఉద్యోగులకు సంబంధించిన క్వార్టర్లను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చి.. జనవరిలోనే వాటిని ప్రారంభించాలని నిర్నయించింది. ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని నిర్మాణ కంపెనీలను కూడా ప్రభుత్వం ఆదేశించింది. కానీ.. ప్రభుత్వానికి ఉన్న తొందర.. ప్రకృతి కి లేదు. గత పది రోజులుగా తరచుగా వర్షాలు పడుతున్నాయి.
దీంతో నిర్మాణ పనులు ఒకింత ఆలస్యం అవుతున్నాయి. పైగా.. రాజధాని ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ లెవిల్స్ కూడా.. పెరిగాయి. కృష్ణానదికి ఎగువ రాష్ట్రాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. ఇది కూడా సదరు నిర్మాణాలకు ఆటంకంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించాల్సిన మంత్రి.. పనులు ఆలస్యం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ.. వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఓ ఇంజనీర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనం పనులు ఈ వారంలో పూర్తి అవుతాయని చెప్పారు. మరో భవనం పనులను ఇక్కడ నిర్మాణం చేస్తున్న యంత్రాలను వినియోగించి వచ్చే నెలలో ప్రారంభిస్తామన్నారు. అంతే.. మంత్రి నారాయణకు కోపం వచ్చింది. “యూజ్ లెస్ ఫెలో .. గెటౌట్.. గెటౌట్..” అంటూ.. విరుచుకుపడ్డారు. పాపం.. హఠాత్పరిణామంతో సదరు ఇంజనీర్ బిక్కచచ్చిపోయారు. అయితే.. ఇలా వ్యాఖ్యలు చేయడం వల్ల మంత్రి నారాయణకు కొత్తగా వచ్చే మెప్పుకన్నా.. సర్కారు పై విమర్శలు వస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates