వైసీపీ నాయకుడు, నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి.. టీడీపీ నాయకురాలు.. ఇదే నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలను పార్టీలకు అతీతంగా అందరూ ఖండిస్తున్నారు. కూటమి నాయకులు సహా.. కమ్యూనిస్టు నేతలు కూడా.. ప్రసన్న కుమార్‌రెడ్డిపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా నందమూరి కుటుంబానికి చెందిన అక్కా చెల్లెళ్లు.. దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి స్పందించారు.
ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు ఖండిస్తున్నానని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులకు మహిళలను కించపరచడం అలవాటుగా మారిపోయిందన్నారు. శాసనసభ లోపల, వెలుపల మహిళలను వ్యక్తిత్వ హననం చేయడం వైసీపీకి అలవాటైపోయిందని నిప్పులు చెరిగారు. ఆరుసార్లు ఎంఎల్ఏ గా గెలిచి మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రసన్నకుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సభ్యసమాజం ఆమోదించని సంఘటన అని పేర్కొన్నారు.
ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన తన తల్లికి, భార్యకి చూపించాలని పురందేశ్వరి ఘాటుగా వ్యాఖ్యానించారు. వాళ్ళు ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు సరైనవే అంటే, తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటానని వ్యాఖ్యానించారు. బేషరతుగా ప్రశాంతిరెడ్డికి ప్రసన్నకుమార్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సైతం ప్రసన్న చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.
మహిళల పట్ల వైసీపీ నేతల తీరు సిగ్గుచేటుగా ఉందన్న భువనేశ్వరి.. సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలకు స్థానం లేదన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి సంఘీభావం ప్రకటిస్తున్నానని చెప్పారు. ఆమెపై చేసిన అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాన్నారు. మహిళల పట్ల అవమానకర పదాలు వారి విలువను తగ్గించలేవని వ్యాఖ్యానించారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నైనా ఖండించాల్సిందేనని భువనేశ్వరి చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates