సోష‌ల్ మీడియాపైనే జ‌గ‌న్ ఆశ‌లు ..!

వైసీపీ అధినేత జగన్ మళ్ళీ సోషల్ మీడియా పైన ఆధారపడినట్లు తెలుస్తోంది. పార్టీ యువజన విభాగం నాయకులతో భేటీ అయిన ఆయన సోషల్ మీడియాను మరింత దూకుడుగా తీసుకువెళ్లాలని చెప్పారు. సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాలని ఆదేశించారు. అయితే సోషల్ మీడియా గురించి రెండు ప్రధాన ప్రశ్నలు అయితే వెంటాడుతున్నాయి. ఒకటి సోషల్ మీడియా ను ప్రజలు ఎంతవరకు ఫాలో అవుతున్నారు అనేది ఒక ప్రశ్న.

ఇక‌, సోషల్ మీడియాలో దూకుడుగా ఉండడం అంటే అధికారపక్షంపై గురుచుకుపడడమా? లేకపోతే పారదర్శకంగా పనిచేయడ‌మా?  గ‌తంలో వైసీపీ చేసిన మంచిని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్ల‌డ‌మా? అనే దాంట్లో తేడా కనిపిస్తోంది. సాధారణంగా ఇప్పటి వరకు వైసిపి సోషల్ మీడియా అనగానే విమర్శలు, వివాదాలకు కేంద్రంగా మారిన చర్చ ఉన్నది. కాబట్టి అనేక కేసులు కూడా నమోదు అయ్యాయి. బోరుగడ్డ అనిల్ కుమార్ వంటి వారు, అలాగే పోసాని కృష్ణ మురళి వంటి సీనియర్ నాయకులు కూడా అరెస్టు అయ్యారు.

సోషల్ మీడియాలో చేసిన దోషణలు, వివాదాస్పద వ్యాఖ్యలు కారణంగానే ఇప్పుడు కూడా అదే పద్ధతిలో జగన్ ముందుకు వెళ్తున్నారా? లేకపోతే  పార‌ద‌ర్శ‌కంగా రాజకీయాలు చేయాలని సూచిస్తున్నారా? అనేది చూడాల్సి ఉంది. మరోవైపు యువతకు అవకాశాలు ఇస్తామని కానీ భవిష్యత్తులో వారికి పదవులు కల్పిస్తామని గాని ఎలాంటి హామీ ఇవ్వకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ కావాలని చెప్పడం కొంతమంది దీనిపై ప్ర‌భావం చూపిస్తోంది.

ఇదే విష‌యంపై వైసీపీ యువజన విభాగంలో నాయకులు చర్చించుకున్నారు. సాధారణంగా సోషల్ మీడియా అంటేనే మధ్యతరగతికి మాత్రమే చేరువైన మాధ్యమం. ఇప్పటివరకు మధ్యతరగతి వ‌ర్గం ఏ మేరకు వైసీపీకి అనుకూలంగా ఉందనే దాన్నిబట్టి సోషల్ మీడియా పనితీరు ఆధారపడి ఉంటుంది. మరి జగన్ ఆశలు ఏ మేరకు ఫ‌లిస్తాయి అనేది చూడండి. మాస్ అయితే.. జ‌గ‌న్ వెంట ఉన్నారు. క్లాస్ మాత్రం చంద్ర‌బాబు వెనుకే ఉన్నార‌న్న‌ది వాస్త‌వం. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఈ సోష‌ల్ మీడియాను ఏ ర‌కంగా డీల్ చేస్తారో చూడాలి.