రాజా సింగ్‌కు శివ‌సేన ప‌గ్గాలు?.. హాట్ డిబేట్‌!

తెలంగాణ బీజేపీ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. త‌న‌కు తెలంగాణ పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లోపోటీ చేసేందుకు అవ‌కాశం క‌ల్పించ‌లేద‌న్న కార‌ణంగా ఆయ‌న అలిగి .. త‌క్ష‌ణ‌మే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీపైనా తీవ్ర విమ‌ర్శ‌లే చేశారు. అంతేకాదు.. కొన్నాళ్లుగా ఆయ‌న పార్టీ నేత‌ల‌పైనా విమ‌ర్శ‌లు చేస్తూ.. వివాదాల‌కు కేంద్రంగానే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. అయితే.. ఆయ‌న‌ను బుజ్జ‌గించేందుకు కేంద్రంలోని పెద్ద‌లు రంగంలొకి దిగార‌ని.. సోమ‌వారం రాత్రి వ‌ర‌కు చ‌ర్చ సాగింది.

కానీ, రాష్ట్రానికి చెందిన ఓ కీల‌క నాయ‌కుడు.. రాజాపై ఫిర్యాదులు చేయ‌డంతోపాటు.. ఆయ‌న వ్య‌వ‌హార శైలిని కూడా త‌ప్పుబడుతూ.. కేంద్రంలోని పెద్ద‌ల‌కు త‌క్ష‌ణ‌మే నివేదిక అందించారు. దీంతో చ‌ర్చించాల‌ని అనుకున్న కేంద్ర పెద్ద‌లు కూడా విరమించుకున్నారు. ఫ‌లితంగా రాజా సింగ్ రాజీనామాను దాదాపు అంగీక‌రించేందుకు పార్టీ కీల‌క నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక‌, రాజా సింగ్ కూడా ఏమాత్రం వెన‌క్కి త‌గ్గేది లేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. ఆది నుంచి ఫైర్ బ్రాండ్ నాయ‌కుడే అయిన‌ప్పటికీ.. ఇంత‌గా రాజా ఎప్పుడూ దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేదు. గ‌తంలో ఆయ‌న‌ను పార్టీ అధిష్టానం స‌స్సెండ్ చేసిన‌ప్పుడు కూడా వెయిట్ చేశారు.

కీల‌క నాయ‌కుల ద్వారా మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేయించుకుని ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను ఎత్తేయించుకున్నారు. కానీ.. ఈ ద‌ఫా మాత్రం కేవ‌లం రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేసుకునే అవ‌కాశం లేద‌న్న ఏకైక కార‌ణంగా రాజా రాజీనామా చేయ‌డం వెనుక ఏదో వ్యూహం ఉండి ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. నిజానికి రాజాసింగ్ నామినేష‌న్ వేసినా.. బీజేపీ ముందుగా ఎవ‌రినైతే ఎంచుకుందో వారినే రాష్ట్ర చీఫ్‌గా నియ‌మిస్తుంది. ఇది కొన్నాళ్లుగా రాష్ట్రాల్లో పార్టీ చేస్తున్న ప్ర‌క్రియే. కానీ, అనూహ్యంగా ఇప్పుడు రాజా ఇంత సీరియ‌స్ కావ‌డానికి రీజ‌న్ వేరే ఉండి ఉంటుంద‌ని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

పొరుగున ఉన్న మ‌హారాష్ట్ర‌లో మాజీ సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే నేతృత్వంలోని శివ‌సేన‌తో రాజాసింగ్‌కు బ‌ల‌మైన సంబంధాలు ఉన్నాయి. మ‌హా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న అక్క‌డ ప్ర‌చారం కూడా చేశారు. అయితే.. అప్ప‌ట్లో బీజేపీకే ప్ర‌చారం చేసినా.. రాజ‌కీయంగా బ‌ల‌మైన హిందూత్వ‌వాదాన్ని ప్ర‌క‌టించే రాజా అంటే.. శివ‌సేన‌కు కూడా మ‌క్కువే. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌లో శివ‌సేన‌కు చోటు క‌ల్పించే దిశ‌గా కూడా కొన్నాళ్ల కింద‌ట చ‌ర్చ‌లు జ‌రిగాయి. అయితే.. అప్ప‌ట్లో రాజా పేరు బ‌య‌ట‌కు రాలేదు. కానీ.. ఇప్పుడు ఎన్నిక‌ల‌కు మూడేళ్ల ముందు, ఇలా జ‌ర‌గ‌డం వెనుక శివ‌సేన వ్యూహం ఉండి ఉంటుంద‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అంటే.. హైద‌రాబాద్‌లో శివ‌సేన‌ను స్తాపిస్తే.. దానికి రాజాను ఖ‌చ్చితంగా అధ్య‌క్షుడిగా(తెలంగాణ విభాగానికి) ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. త‌ద్వారా.. రాజా హిందూత్వ‌తో బీజేపీకి ఉన్న బ‌ల‌మైన మ‌ద్ద‌తును, ఓటు బ్యాంకును కూడా శివ‌సేన చీల్చే అవ‌కాశం ఉంటుంది. బీజేపీ.. త‌మ‌ను మ‌హారాష్ట్ర‌లో దెబ్బ కొట్టింద‌న్న ఆవేద‌న ఉద్ధ‌వ్‌లో ఉంది. ఈ నేప‌థ్యంలో రాజాను త‌న పార్టీలోకి ఆహ్వానించే అవ‌కాశం.. తెలంగాణ‌లో శివ‌సేన వింగ్‌ను ప్రారంభించే ఛాన్స్ లేక‌పోలేద‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్న మాట‌. అందుకే.. రాజా.. ఇంత స‌డ‌న్ నిర్ణ‌యం తీసుకున్నార‌ని విశ్లేషిస్తున్నారు. రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు.. సో.. రాజా సింగ్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది చూడాలి.