మద్యం కుంభకోణం దర్యాప్తునకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంపై వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాజీ గన్ మన్ మదన్ రెడ్డి మంగళవారం సంచలన ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చెవిరెడ్డికి పాత్ర ఉన్నట్లుగా స్టేట్ మెంట్ ఇవ్వాలని ఒత్తిడి తీసుకురావడంతో పాటుగా తనపై సిట్ అదికారులు దాడికి దిగారంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన మదన్… ఆ పిటిషన్ లోని అంశాలతో సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీలకు లేఖ కూడా రాశారు. ఈ లేఖపై తాజాగా సిట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మదన్ వన్నీ తప్పుడు ఆరోపణలని చెప్పిన సిట్.. లిక్కర్ కేసులో చెవిరెడ్డికి పాత్ర ఉందని తేల్చి చెప్పింది.
ఈ మేరకు మంగళవారం సిట్ కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటిదాకా 200 మందిని తమ కార్యాలయానికి పిలిచి విచారించామన్న సిట్.. వారిలో ఏ ఒక్కరు కూడా మదన్ మాదిరి ఆరోపణలు చేయలేదన్న విషయాన్ని గుర్తించాలని తెలిపింది. అంతేకాకుండా అన్ని ఆధారాలతో తాము విచారణలో ముందుకు సాగుతున్నామని, తాము సేకరించిన ఆధారాల మేరకే ఇప్పటిదాకా ఈ కేసులో ప్రత్యక్ష ప్రమేయం ఉన్న ఏడుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామని తెలిపింది. అసలు ఈ కేసులో కీలక రాజకీయ నేతలు ఉన్న నేపథ్యంలో దర్యాప్తును అత్యంత పారదర్శకంగా జరుపుతున్నామని పేర్కొంది.
ఇక మదన్ విషయం గురించి చెబుతూ… తాము చెప్పినట్టుగా స్టేట్ మెంట్ ఇవ్వమని మదన్ ను కోరిన మాట పూర్తిగా అవాస్తవమని సిట్ స్పష్టం చేసింది. ఆ దిశగా మదన్ ను తాము బలవంతం చేశామని చెప్పడంలోనూ ఎలాంటి నిజం లేదని తెలిపింది. మద్యం కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డి నుంచి చెవిరెడ్డికి నగదు అందిందని, దానిని చెవిరెడ్డి ఎన్నికల్లో పంపిణీ చేశారని తెలిపింది. ఈ విషయాలను నిర్ధారించుకునేందుకే నాడు చెవిరెడ్డి వద్ద గన్ మన్ గా పనిచేసిన మదన్ ను విచారణకు పిలిచామని వెల్లడించింది. అయితే మదన్ తమ విచారణకే సహకరించలేదని కూడా సిట్ తేల్చి చెప్పింది.
విచారణలో భాగంగా తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యతను పక్కనపెట్టిన మదన్ రెడ్డి… తన అధికారులపై బెదిరింపులకు దిగారని సిట్ ఆరోపించింది. ఈ దిశగా మదన్ ను ప్రశ్నిస్తున్న అధికారులను ఉద్దేశించి… మీ పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటానని మదన్ బెదిరించారని వెల్లడించింది. అయినా ఈ కేసులో 200 మంది విచారణకు హాజరు కాగా… వారిలో ఏ ఒక్కరు కూడా తమపై ఆరోపణలు చేయలేదని, మదన్ ఒక్కరే చెవిరెడ్డిని ఈ కేసు నుంచి బయటపడవేసేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించింది. అయితే ఈ తరహా ఆరోపణలకు ఏమాత్రం వెనుకాడేది లేదన్న సిట్… కేసును మరింత పకడ్బందీగా దర్యాప్తు చేస్తామని పేర్కొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates