గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో విమానంలోని 241 మంది చనిపోగా… ఒకే ఒక్కడు మృత్యుంజయుడిలా మంటల్లో నుంచి అలా నడుచుకుంటూ బయటకు వచ్చాడు. అతడే గుజరాత్ కే చెందిన రమేశ్ విశ్వాస్ కుమార్. ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న అతడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పరామర్శించారు.
ఈ సందర్బంగా ప్రమాదం ఎలా జరిగింది? అసలు ఏం జరిగింది? ప్రస్తుతం నీ ఆరోగ్యం ఎలా ఉంది? అంటూ మోదీ అతడిని ఆరా తీశారు. అంతేకాకుండా తామంతా అండగా ఉన్నామని, భయపడాల్సిన పని లేదని కూడా మోదీ అతడిని అభయం ఇచ్చారు. మోదీని చూడగానే… కొండంత అండ లభించినట్టుగా ఫీల్ అయిన రమేశ్… ప్రమాదం నుంచి తాను బయటపడినా తన సోదరుడు మాత్రం ఏమయ్యాడో తెలియడం లేదని బోరుమన్నాడు.
ఇక అంత పెద్ద ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డానన్న విషయాన్ని రమేశ్ వైద్యులకు వివరించారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విమానం టేకాఫ్ తీసుకున్న మరుక్షణమే ఆకాశంలోనే రెండు ముక్కలు అయిపోయిందని తెలిపాడు. ఆ సమయంలో తాను కూర్చున్న 11ఏ సీటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ వద్ద ఉందని వివరించాడు. విమానం రెండు ముక్కలు కాగానే… తన సీటు విమానం నుంచి ఊడి అల్లంత దూరాన పడిందని తెలిపాడు. తాను సీటు బెల్టు పెట్టుకున్న కారణంగా తాను కూడా సీటుతో సహా అల్లంత దూరాన పడిపోయానని వివరించాడు.
ఇదిలా ఉంటే… ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో విమానంలో ఉన్న వారిలో రమేశ్ మినహా 241 మంది చనిపోగా… విమానం కూలిన మెడికల్ కాలేజీ భవనంలోని వైద్యులు, ఇతర సిబ్బందితో కలిపి 24 మంది చనిపోయారు. మొత్తంగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 265గా తేలింది. ఈ మేర పౌరుల ప్రాణాలు బలిగొన్న ఈ ప్రమాదం భారత్ లో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదంగా పరిగణిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates