రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఒక్కరికి మాత్రమే పరిమితం అనుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకప్పుడు రూ.2కే కిలో బియ్యం అనేది ఎన్టీఆర్ నినాదం. తర్వాత.. అది ఆయనకు పేటెంట్‌గా కూడా మారిపోయింది. అయితే.. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా దీనిని చెరపలేకపోయాయి. ఇక, చంద్రబాబు..ఐటీ-విజన్ ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇది కూడా ఆయనకు పేటెంట్‌గా మారింది. అయితే.. తర్వాత కాలంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఆయనకు ఉన్న పేటెంట్‌ను మార్చ లేకపోయాయి. లాగేసుకోలేక పోయాయి.
ఇక, ఈ పరంపరలోనే జగన్ 2019-24 మధ్య కొన్ని పథకాలను ప్రవేశ పెట్టారు. వాటిలో ఎక్కువగా ఖర్చుతో కూడుకున్నది.. మహిళలను ముఖ్యంగా ఆకర్షించింది.. ‘అమ్మ ఒడి’ పథకం. ఒకరకంగా.. ఇది జగన్‌కు పేటెంట్‌గా మారింది. దీనిని తాము తప్ప.. ఎవరూ ఇవ్వలేరన్న వాదనను కూడా తెరమీదికి తీసుకువచ్చింది. ఎందుకంటే.. ఏటా 6500 కోట్ల రూపాయలను అప్పట్లో జగన్ ఖర్చుచేసేవారు. ఇంత పెద్ద మొత్తం ఏ ప్రభుత్వం ఇవ్వలేదని.. ముఖ్యంగా చంద్రబాబు అయితే.. అసలు ఇవ్వరని కూడా.. వైసీపీ నాయకులు ప్రచారం చేసుకున్నారు. దీనిలో జగన్ కూడా ఉన్నారు.
నిజమే.. అత్యంత భారీ ఖర్చుతో కూడిన ఈ పథకాన్ని దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. ఇచ్చే ఆలోచన కూడా చేయలే దు. ఎందుకంటే.. వేల కోట్ల రూపాయలను సంక్షేమానికి ఇచ్చే బదులు పెట్టుబడిగా పెట్టి అభివృద్ది సాధిస్తే బెటర్ అనే ఆలోచన ఉండడమే. అందుకే.. గతంలో పంజాబ్, కర్ణాటక ప్రభుత్వాలు కూడా.. జగన్ ప్రభుత్వం వద్దకు వచ్చి అమ్మ ఒడి పథకాన్ని అధ్యయనం చేశాయే తప్ప.. అవి అమలు చేయలేకపోయాయి. అంతేకాదు.. ఇంత పెద్ద మొత్తం ఇవ్వలేమని కూడా పంజాబ్ పాలకులు అప్పట్లో చెప్పారు. దీంతో అమ్మ ఒడి వంటి ఘనమైన పథకాన్ని తాము తప్ప ఎవరూ అమలు చేయలేరని జగన్ కూడా చెప్పుకొచ్చారు.
అయితే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్‌కు మాత్రమే ఉందని భావించిన ఈ పేటెంట్‌ను లాగేసుకుంటోంది. చంద్రబాబు ఈ పథకాన్ని ఓవర్ టేక్ చేస్తూ.. తల్లికి వందనం పేరుతో అమలుకు శ్రీకారం చుట్టారు. ఏకంగా 68 లక్షల మంది తల్లులకు ఎంత మంది పిల్లలు ఉన్నా.. తల్లికి వందనం పథకాన్ని అమలు చేసేందుకు.. సుమారు.. 8.5 వేల కోట్లరూపాయలను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇది ఒకరకంగా.. జగన్ చేసిన ఖర్చు 6.5 వేల కోట్లతో పోల్చితే.. మరో 2 వేల కోట్ల రూపాయలు ఎక్కువ. సో.. దీనిని బట్టి ఇప్పటి వరకు జగన్ మాత్రమే చెప్పుకొన్న అమ్మ ఒడి పేటెంట్‌ను ఇక, ఇప్పుడు చంద్రబాబు లాగేసుకున్నట్టు అయిందని అంటున్నారు పరిశీలకులు. ఏదేమైనా ఎప్పుడూ ఒక్కరి ఆలోచనే సరికాదు కదా!!.
Gulte Telugu Telugu Political and Movie News Updates