చెవిరెడ్డి ఉబలాటం ఓ సారి తీరిస్తే పోలా..?

వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అదినేతకు అత్యంత విశ్వసనీయుడిగా గుర్తింపు సంపాదించుకున్న చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి ఈ మధ్య పదే పదే మీడియా ముందుకు వస్తున్నారు. ఏపీలో కలకలం రేపుతున్న లిక్కర్ స్కాం గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. లిక్కర్ స్కాంలో తనను ఇరికించాలని కూటమి సర్కారు కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. అదే గనుక జరిగితే… సిట్ అదికారులు తనకు ఫోన్ చేస్తే చాలు తానే సిట్ కార్యాలయానికి వెళ్లి లొంగిపోతానని ఆయన చెబుతున్నారు.

వాస్తవానికి మద్యం కుంభకోణంలో చాలా మంది పాత్ర ఉన్నట్లు ఇప్పటికే సిట్ అధికారులు తేల్చారు. నాటి ఏపీ సీఎం వద్ద కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను కూడా ఇప్పటికే సిట్ అరెస్టు చేసింది. ఇక ప్రభుత్వ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేని భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను కూడా ఈ కుంభకోణంలో పాలుపంచుకున్నారని తేల్చి… ఆయననూ అరెస్టు చేసింది. జనానికి అత్యధిక ధరలకు నాసికరం మద్యం అమ్మడమే కాకుండా దానిపై భారీగా దండుకున్న ఈ దందాపై కూటమి సర్కారు నిజంగానే సీనియర్ గా ఉందని చెప్పక తప్పదు.

ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ కేసుపై పదే పదే మాట్లాడటమే కాకుండా… తనను అరెస్టు చేసేందుకు చూస్తున్నారని, అందుకోసం తనతో కొంతమేర సంబంధాలు ఉన్న వారిపై ఒత్తిడి పెట్టి మరీ లిక్కర్ స్కాంలో తన ప్రమేయం ఉన్నట్లు చెప్పాలని భయపెడుతున్నారని చెవిరెడ్డి గత వారం రోజులుగా ఆరోపిస్తూనే ఉన్నారు. అయినా తాను అసలు మద్యమే ముట్టనన్న చెవిరెడ్డి… మద్యం కారణంగా తన కుటుంబంలో ఇద్దరు మరణించారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరూ ఏమీ అడగకుండానే చెవిరెడ్డి ఇవన్నీ చెబుతున్నారంటే… మతలబు ఏదో ఉన్నట్టేనన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి.

పోలీసుల భాషలో తప్పు చేసిన వారిలో అంతగా చలాకీతనం లేకపోతే… గుమ్మడికాయల దొంగలెవరంటే భుజాలెగరేసే వారి మాదిరిగా ఉంటే… తెలివి మీరిన వారు మాత్రం గుమ్మడికాయల ప్రస్తావన లేకుండా ముందు ముందుగానే బజారుకెక్కుతారు. చెవిరెడ్డి పరిస్థితి కూడా ఈ మాదిరిగానే ఉందని చెప్పక తప్పదు. చెవిరెడ్డి గత వారంగా చేస్తున్న వ్యాఖ్యలను చూస్తుంటే…చెవిరెడ్డిలోని ఉబలాటాన్ని చూసి అయినా ఓ సారి అరెస్టు విచారిస్తే సరిపోలా అన్న మాట జనం నుంచి భారీ స్థాయిలోనే వినిపిస్తోంది.